పట్టాల పంపిణీలో అవకతవకలున్నాయని జనం ఆగ్రహం
ముఖం చాటేసిన మంత్రి మహీధర రెడ్డి,ఎంపీ మాగుంట
ఒంగోలులోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణం శనివారం ఉదయం పేదల ఆగ్రహ జ్వాలలతో అట్టుడికిపోయింది. నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇంటి పట్టాల జాబితాలో అవకతవకలున్నాయని జనం తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులు, డబ్బులిచ్చిన వారి పేర్లనే రెవెన్యూ సిబ్బంది జాబితాలో చేర్చారని నిలదీశారు. దీంతో పట్టాలు పంపిణీ చేయాల్సిన మంత్రి మహీధర రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి రాకుండా ముఖం చాటేశారు.
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ :
నగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా అది రసాభాసగా మారింది. నగరంలో అర్హులకు నివేశన స్థలాలు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. తీరా జాబితాలో అర్హుల పేర్లు మాయం కావడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి, ఎంపీలు తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా ముఖం చాటేశారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు తాము బలయ్యామని మహిళలు ఉగ్రరూపం దాల్చారు. ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్వోలు చేతివాటం చూపి ఇష్టానుసారంగా జాబితా తయారు చేశారని అర్హులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలరాం కాలనీ, పాపా కాలనీ, గోపాలనగరం, సంతపేట, రామ్‌నగర్, ఇస్లాంపేట, రిక్షాబజారు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పేర్లు నివేశన స్థలాల జాబితాలో లేవు. అర్హులకు ఎందుకు పట్టాలు మంజూరు చేయలేదని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలను పోలీసులు అక్కడి నుంచి పక్కకు పంపివేశారు.
మంత్రి, ఎంపీ కోసం ఎదురు చూసిన మహిళలు పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి, ఎంపీలు వస్తారని, వారినే నిలదీద్దామని బాధిత మహిళలు కోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం వరకూ ఒకరు కూడా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు సీపీఎం నేతలు అక్కడకు వచ్చారు. పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన జాబితా తప్పుల తడకగా ఉందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే పట్టాలివ్వాలని ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. ఇంతలో పట్టాల పంపీణీ వాయిదా వేస్తున్నట్లు తహసీల్దార్ ప్రకటించారు. జాబితాలో పేర్లున్న వారు సంబంధిత పత్రాలు, భార్యాభర్తల ఫొటోలతో కార్యాలయంలో సంప్రందించి పట్టాలు పొందొచ్చని చెప్పటంపై అర్హులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులిచ్చిన వారికే పట్టాలు :
కొప్పులగడ్డ లక్ష్మి, బలరాం కాలనీ
తహసీల్దార్, ఆయన కార్యాలయ సిబ్బంది డబ్బులు తీసుకుని అనర్హులైన ఉన్నత వర్గాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆరేళ్ల నుంచి కాళ్లరిగేలా తిరిగినా అర్హులకు అన్యాయం జరిగింది. దయచేసి పునఃపరిశీలించి అర్హులకు మాత్రమే స్థలాలివ్వాలి.
అనర్హుల పట్టాలు రద్దు చేయాలి: కాకర్లపూడి మాధవి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి కూడా పట్టాలిచ్చారు. అంతేకాకుండా సంపన్న కుటుంబాలకు చెందినవారూ పట్టాలు పొందారు. అలాంటి అనర్హుల పట్టాలు రద్దు చేసి నిజమైన పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి.
తహసీల్దార్ ఏమన్నారంటే..
అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు చెప్పారు. జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని, ఆ జాబితాలో కొందరు ఆరోపిస్తున్నట్లు అనర్హులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. అది నిజమైతే పట్టాలు రద్దుచేసి అర్హులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు పరిధిలో నివేశ స్థలాల కోసం మొత్తం 18 వేల దరఖాస్తులు వచ్చాయని, నాలుగు వేల మందిని అర్హులుగా గుర్తించినా సరిపడా స్థలం లేదని తహసీల్దార్ పేర్కొన్నారు.
పైసలిస్తేనే పట్టాలా?
Published Sun, Feb 2 2014 2:57 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement