జూన్ 1 భూ సమీకరణ పూర్తి చేయాలి
►పూర్తయిన గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలి
►భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి
►ఈ నెల 25కు రాజధాని మాస్టర్‌ప్లాన్ సిద్ధం..
►న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
►స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో
►జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్
గుంటూరు ఎడ్యుకేషన్ : రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియ జూన్ ఒకటో తేదీకి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో భూ సమీకరణ విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నిర్ధేశించుకున్న 32,783 ఎకరాల్లో ఇప్పటికి 29 వేల ఎకరాలు సమీకరించిన దృష్ట్యా మిగిలిన భూములను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం భూ సమీకరణ పూర్తయిన తుళ్లూరు, మందడం గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు.
రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి ...
గుర్తించిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన అన్ని పత్రాలను భద్రపర్చాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధితోపాటు ఆయా కుటుంబాల్లో విద్యావంతులకు సాంకేతిక శిక్షణ కల్పించే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ. 30 వేల కోట్లు వెచ్చించనున్న దృష్ట్యా నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఈ దిశగా రైతులను చైతన్యవంతులను చేసి వారికి ఆసక్తి గల రంగంలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈనెల 25కు మాస్టర్‌ప్లాన్ సిద్ధం
సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణ మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ ఈనెల 25వ తేదీకి సిద్ధం కానున్న దృష్ట్యా సమీకరించిన భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఆర్‌డీఏ పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ఇప్పటికే చేపట్టిన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. సామాజిక ఆర్థిక సర్వేను త్వరగా పూర్తి చేసి భూములకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంలా ఉండే విధంగా చూడాలన్నారు.
కోర్టుల్లో ఉన్న న్యాయ వివాదాలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులను నియమించుకుని త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చి భూములను స్వాధీనం చేయని రైతులకు నోటీసులు జారీ చేసి, వారిని పిలిచి మాట్లాడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ భూములను సమీకరించడం ఎంత ముఖ్యమో సమీకరించిన భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్ర పర్చడం అంతే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టా, పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాలను సేకరించి వాటిని ఫైళ్లలో భద్రపర్చాలన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.