crda Commissioner Srikanth
-
మంత్రి నారాయణ X సీఆర్డీఏ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) వ్యవహారాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, కమిషనర్ శ్రీకాంత్ నడుమ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. గత కొద్ది కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం రాసిన లేఖ ఆజ్యం పోసినట్లై భగ్గుమంది. రాజధాని ప్రాంత గ్రామాల్లో సభలు నిర్వహణ, చెక్కుల పంపిణీ విషయాల్లో వీరి మధ్య మొదలైన మనస్పర్థలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయి. తాజాగా సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తాత్కాలిక సచివాలయం వద్దకు విధిగా వెళ్లాలని, రోజులో కనీసం పదిగంటలైనా నిర్మాణ ప్రాంతంలో పర్యవేక్షించాలని మంత్రి లేఖ రాయడంతో వ్యవహారం భగ్గుమంది. మంత్రి రాసిన లేఖ వ్యంగ్యంగా ఉందని, కమిషనర్ శ్రీకాంత్ మనస్తాపానికి గురయ్యారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రి లేఖపై కమిషనర్ శ్రీకాంత్ నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే విషయం చాలా సాధారణమైందని, దీనిపై రాద్ధాంతం అనవసరమని మంత్రి పేషీ అధికారులు చెబుతున్నారు. అయితే వారి మధ్య ఇప్పటికే భేదాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా రాజధాని వ్యవహారాలైన సచివాలయం టెండర్లు, అధికారుల విదేశీ పర్యటనలతో పలు ఆరోపణలు మంత్రిపై వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రి నారాయణ విషయంలో కినుకు వహించారు. రెవెన్యూ వ్యవహారాల్లో మంత్రి నారాయణ జోక్యాన్ని పలు సందర్భాల్లో కేఈ తప్పుపట్టారు. ఇప్పుడు అధికార వర్గాలతోనూ మంత్రి నారాయణ తీరుపై విసృ్తత చర్చ జరుగుతోంది. -
ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు
- సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భవానీపురం : నూజివీడు రోడ్డు నుంచి రామవరప్పాడు వరకు నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజధానిప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ(సీఆర్డీఎ) కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్ జిల్లా ఉన్నతాధికారులను కోరారు. సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సమక్షంలో స్థలాల యజమానులతో చర్చించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని పాయకాపురం, గుణదల గ్రామాల్లో 1719 చదరపు గజాల భూసేకరణకు అవార్డు విచారణ పూర్తి చేశామన్నారు. పాయకాపురానికి చెందిన 277 చదరపు గజాల భూమి యజమాని ఎన్వీఎస్ ప్రకాశరావు నష్టపరిహారం పెంపు కోరుతూ కోర్టులో వాజ్యం వేశారని తెలిపారు. దీనిపై కలెక్టర్ బాబు.ఎ స్పందిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఉన్న విలువపై ప్రస్తుతం రూ.37 లక్షల నష్టపరిహారం, దానిపై 12 శాతం వడ్డీ ఇస్తామని ప్రకాశ రావుకు తెలిపారు. గుణదలలో రింగ్‌రోడ్ నిర్మాణం పరిధిలో 458 చ.గజాలలో ఉన్న చర్చిని వేరే చోటకు తరలించేందుకు 10 రోజులలో నష్టపరిహారం చెల్లించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కుందావారి కండ్రిక, నున్న, రామవరప్పాడు, గుణదల గ్రామాలలోని 5,922 చ.గజాల స్థల సేకరణపై సెక్షన్ 11(1) ప్రకారం ప్రతిపాదనలు పంపామని సీఆర్డీఎ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నున్న గ్రామానికి చెందిన 2719 చ.గజాల స్థలం ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ స్థలయజమానులు సుబ్రహ్మణ్యం తదితరులు కలెక్టర్‌కు తెలిపారు. ఫ్లైవోవర్ సమీపంలో ఆక్రమించుకుని వాణిజ్య ప్రయోజనాలకు భూమిని వినియోగిస్తున్న పట్టపురాజు రాజేశ్వరరావుకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించి సబ్సిడీతోకూడిన బ్యాంక్ రుణం ఇచ్చేందుకు కలెక్టర్ హమీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివా రణకు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆవశ్యకత గుర్తించాలని స్థల యజమానులను సీపీ కోరారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 1 భూ సమీకరణ పూర్తి చేయాలి
►పూర్తయిన గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలి ►భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి ►ఈ నెల 25కు రాజధాని మాస్టర్‌ప్లాన్ సిద్ధం.. ►న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోండి ►స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల సమావేశంలో ►జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ గుంటూరు ఎడ్యుకేషన్ : రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియ జూన్ ఒకటో తేదీకి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నిర్ధేశించుకున్న 32,783 ఎకరాల్లో ఇప్పటికి 29 వేల ఎకరాలు సమీకరించిన దృష్ట్యా మిగిలిన భూములను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం భూ సమీకరణ పూర్తయిన తుళ్లూరు, మందడం గ్రామాల్లో రెండో పంట వేయకుండా జాగ్రత్త పడాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి ... గుర్తించిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన అన్ని పత్రాలను భద్రపర్చాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధితోపాటు ఆయా కుటుంబాల్లో విద్యావంతులకు సాంకేతిక శిక్షణ కల్పించే విధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ. 30 వేల కోట్లు వెచ్చించనున్న దృష్ట్యా నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఈ దిశగా రైతులను చైతన్యవంతులను చేసి వారికి ఆసక్తి గల రంగంలో ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 25కు మాస్టర్‌ప్లాన్ సిద్ధం సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణ మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ ఈనెల 25వ తేదీకి సిద్ధం కానున్న దృష్ట్యా సమీకరించిన భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ఇప్పటికే చేపట్టిన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. సామాజిక ఆర్థిక సర్వేను త్వరగా పూర్తి చేసి భూములకు సంబంధించిన అన్ని వివరాలు సక్రమంలా ఉండే విధంగా చూడాలన్నారు. కోర్టుల్లో ఉన్న న్యాయ వివాదాలకు సంబంధించి సీనియర్ న్యాయవాదులను నియమించుకుని త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూ సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చి భూములను స్వాధీనం చేయని రైతులకు నోటీసులు జారీ చేసి, వారిని పిలిచి మాట్లాడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ భూములను సమీకరించడం ఎంత ముఖ్యమో సమీకరించిన భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్ర పర్చడం అంతే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టా, పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్, రేషన్ కార్డు తదితర పత్రాలను సేకరించి వాటిని ఫైళ్లలో భద్రపర్చాలన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పంటలపై పిడుగు!
రాజధాని ప్రాంత రైతులు ఇక సాగుకు దూరం 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు ప్రస్తుత రబీ సీజన్ వరకే పంటల సాగును అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం ఏడాదిలో మూడు పంటలు పండించే రైతన్నలకు శరాఘాతం ఎకరాకు సగటున రూ. లక్ష వరకు ఆర్జిస్తున్న అన్నదాతలు భూ సమీకరణ కొలిక్కి రాకుండానే సర్కారు తీసుకున్న నిర్ణయంపై విస్మయం సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం శ్రమిస్తూ, కంటికి రెప్పలా పంటల్ని కాపాడుకుంటూ.. సాగులో సిరులు కురిపిస్తున్న కృష్ణానది పరీవాహక రాజధాని ప్రాంత రైతుల పాలిట పిడుగుపాటు లాంటి వార్త ఇది. ఏడాదికి మూడు పంటలు పండే ఆయా గ్రామాల్లో తదుపరి సీజన్ నుంచి సాగును అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న పంటల సాగును రైతులకు దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది రైతుల భవితను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. రాజధాని ప్రాంతంలో పంటల సాగుకు ఈ సీజన్ (రబీ) వరకే అనుమతి ఉందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ బుధవారం ప్రకటించడంతో మూడు మండలాల పరిధిలోని 29 గ్రామాల రైతుల్లో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలైంది. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో భూ సమీకరణ సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో.. ఆ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఆ మొత్తం ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల సాగును నిషేధించడం రైతులకు విస్మయం కలిగిస్తోంది. సాగుకు దూరంగా ఉండాలనే ఊహతోనే రైతన్నలు కుమిలిపోతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఇక దయనీయంగా మారనుంది. ఎన్నో ఏళ్లుగా సాగునే నమ్ముకుని స్వాభిమానంతో జీవనం కొనసాగిస్తున్న అన్నదాతలకు భూ సమీకరణ శరాఘాతంలా తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాకు చెందిన మూడు మండలాల పరిధిలో 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తించింది. ఈ గ్రామాల్లో పట్టా, అసైన్డ్, దేవాదాయ, అటవీ, పోరంబోకు భూములన్నీ కలిపి 51,788 ఎకరాలున్నట్టుగా అప్పట్లో నివేదికలు సిద్ధం చేసింది. ఈ 29 గ్రామాల పరిధిలో రైతులు సాగు చేస్తున్న భూములు మొత్తం 41,750 ఎకరాలు. అయితే రాజధాని నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో 34 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు నిర్ణయించి ఈ నెల 2 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పంటలు వేసుకునేందుకు అవకాశమే లేదని తాజాగా తేల్చి చెప్పడంతో బ్యాంకు రుణాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ప్రాంత రైతులకు రుణాలు మంజూరు చేయరాదని బ్యాంకర్లకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖికంగా తెలియజేసింది. ఇలావుండగా ప్రభుత్వం భూ సమీకరణకు ప్రతిపాదించిన 29 గ్రామాలన్నింటిలో రైతులు ఏడాది పొడవునా మూడు పంటలు పండిస్తున్నారు. అరటి, పసుపు, కంద, మొక్కజొన్న, అన్ని రకాల పూలతోటలు, అన్ని రకాల కూరగాయలు, ఉల్లి, మునగ పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్ సౌకర్యం కూడా రైతులకు అందుబాటులో ఉండటంతో నికర లాభాలను ఆర్జిస్తున్నారు. కృష్ణా పరివాహక జరీబు భూముల్లో అంతర పంటలు (అరటిలో కంద, పసుపు, పూలతోటలు) సాగు చేసి ఒకేసారి రెండు పంటల ఫలసాయాన్ని కూడా రైతన్నలు పొందుతున్నారు. మెట్ట పైర్లు అరటి, పసుపు, కంద సాగుతో రూ.90 వేలు నుంచి రూ.లక్ష వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ ప్రాంతంలో కౌలు రేట్లే ఏడాదికి ఎకరాకు రూ.50 వేల వరకు ఉన్నాయంటే పంటల సాగు ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కౌలు రైతులు భూముల్ని సాగు చేసి ఎకరాకు పెట్టుబడి ఖర్చులన్నీ పోనూ రూ.70 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడున్న 12 వేల మంది కౌలు రైతులు జరీబు భూముల్ని సాగు చేసి నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పరిహారం ఊసెత్తని ప్రభుత్వం రాజధానికి భూములిచ్చే రైతులకు పరిహారంగా ఎకరాకు మెట్ట భూములకైతే రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదీ పదేళ్ళ పాటు మాత్రమే. మధ్యలో అభివృద్ధి చేసిన భూమి అమ్ముకుంటే ప్రకటించిన పరిహారం ఇవ్వరు. ఇక పరిహారం ఎప్పుడిస్తారన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా పంటల సాగుకు అనుమతి లేదని చెప్పారే కానీ పరిహారం విషయం ప్రస్తావించలేదు. అయినా ఏడాది పొడవునా సాగు చేస్తే తమకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ పాటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
నగరాన్ని సుందరీకరించండి
నగరపాలక సంస్థ అధికారులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ విజయవాడ బ్యూరో : విజయవాడ-గుంటూరు నగరాల్లో సుందరీకరణ పనులను వెంటనే చేపట్టి సంక్రాంతి పండుగలోపు పూర్తిచేయాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ రెండు నగరపాలక సంస్థల అధికారులకు సూచించారు. నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన శనివారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, గుంటూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించారు. ఈ రెండు నగరాల మధ్యే రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటికి విశేషమైన ప్రాధాన్యం వచ్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో రెండు నగరాలకు సాధ్యమైనంత త్వరలో రాజధాని శోభను తీసుకురావాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రెండు నగరాల్లోని ప్రధాన రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, గ్రీనరీని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యుత్ దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. రాజధాని నగరానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, వారికి రాజధానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేసే బాధ్యత అందరిపైనా ఉందని శ్రీకాంత్ చెప్పారు.