ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు
- సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్
భవానీపురం : నూజివీడు రోడ్డు నుంచి రామవరప్పాడు వరకు నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాజధానిప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ(సీఆర్‌డీఎ) కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్ జిల్లా ఉన్నతాధికారులను కోరారు.
సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సమక్షంలో స్థలాల యజమానులతో చర్చించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని పాయకాపురం, గుణదల గ్రామాల్లో 1719 చదరపు గజాల భూసేకరణకు అవార్డు విచారణ పూర్తి చేశామన్నారు. పాయకాపురానికి చెందిన 277 చదరపు గజాల భూమి యజమాని ఎన్‌వీఎస్ ప్రకాశరావు నష్టపరిహారం పెంపు కోరుతూ కోర్టులో వాజ్యం వేశారని తెలిపారు.
దీనిపై కలెక్టర్ బాబు.ఎ స్పందిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన నాటికి ఉన్న విలువపై ప్రస్తుతం రూ.37 లక్షల నష్టపరిహారం, దానిపై 12 శాతం వడ్డీ ఇస్తామని ప్రకాశ రావుకు తెలిపారు. గుణదలలో రింగ్‌రోడ్ నిర్మాణం పరిధిలో 458 చ.గజాలలో ఉన్న చర్చిని వేరే చోటకు తరలించేందుకు 10 రోజులలో నష్టపరిహారం చెల్లించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. కుందావారి కండ్రిక, నున్న, రామవరప్పాడు, గుణదల గ్రామాలలోని 5,922 చ.గజాల స్థల సేకరణపై సెక్షన్ 11(1) ప్రకారం ప్రతిపాదనలు పంపామని సీఆర్‌డీఎ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
నున్న గ్రామానికి చెందిన 2719 చ.గజాల స్థలం ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ స్థలయజమానులు సుబ్రహ్మణ్యం తదితరులు కలెక్టర్‌కు తెలిపారు. ఫ్లైవోవర్ సమీపంలో ఆక్రమించుకుని వాణిజ్య ప్రయోజనాలకు భూమిని వినియోగిస్తున్న పట్టపురాజు రాజేశ్వరరావుకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించి సబ్సిడీతోకూడిన బ్యాంక్ రుణం ఇచ్చేందుకు కలెక్టర్ హమీ ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, ప్రమాదాల నివా రణకు ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆవశ్యకత గుర్తించాలని స్థల యజమానులను సీపీ కోరారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ కె.శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.