
నగరాన్ని సుందరీకరించండి
నగరపాలక సంస్థ అధికారులతో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్
విజయవాడ బ్యూరో : విజయవాడ-గుంటూరు నగరాల్లో సుందరీకరణ పనులను వెంటనే చేపట్టి సంక్రాంతి పండుగలోపు పూర్తిచేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ రెండు నగరపాలక సంస్థల అధికారులకు సూచించారు. నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆయన శనివారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, గుంటూరు కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై చర్చించారు. ఈ రెండు నగరాల మధ్యే రాజధాని నిర్మిస్తున్న నేపథ్యంలో వాటికి విశేషమైన ప్రాధాన్యం వచ్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.
ఈ సమయంలో రెండు నగరాలకు సాధ్యమైనంత త్వరలో రాజధాని శోభను తీసుకురావాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రెండు నగరాల్లోని ప్రధాన రోడ్లను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, గ్రీనరీని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యుత్ దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. రాజధాని నగరానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, వారికి రాజధానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేసే బాధ్యత అందరిపైనా ఉందని శ్రీకాంత్ చెప్పారు.