జోన్ల వారీగా వాణిజ్య అనుమతులతో నిధుల సమీకరణ
ప్రతి రోజూ 1–2 టీఎంసీల నీటి విడుదలతో మూసీ శుద్ధి
నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర ఇంపాక్ట్ ఏరియా
10 వేలకు పైగా ఆక్రమణలే మూసీ సుందరీకరణకు అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా రూ.60 వేల కోట్లు. దశల వారీగా మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన సర్కారు.. నది సుందరీకరణ, నిర్వహణ కోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. 2050 మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నది పరిసరాలను జోన్ల వారీగా విభజించి వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తోంది.
దీనికి అనుగుణంగా మూసీ వెంట రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నదీ గర్భం నుంచి ఇరువైపులా కిలోమీటరు మేర ఇంపాక్ట్ ఏరియాగా ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు యంత్రాంగం.. ఇప్పటికే నది హద్దులు, ఆక్రమణలపై ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా జీఐఎస్ మ్యాపింగ్‌ను చేసింది.
ఆక్రమణలే అడ్డంకి..
మూసీ రివర్ ఫ్రంట్‌ను పునరాభివృద్ధి చేయాలనే ఆలోచన తొలుత 1908లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. మురుగునీరు, ఆక్రమణలే మూసీ పునరుజ్జీవానికి ప్రధాన అడ్డకుంలుగా నిలిచాయి. 55 కి.మీ మేర నదీ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించడం ప్రభుత్వానికి కష్టతరమైన పనే అని అంటున్నారు.
నది పునరుజ్జీవం కావడానికి 15–20 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్రమణలు సుమారు 2వేల మేర ఉంటాయని అంచనా వేసిన యంత్రాంగం.. వీటిని తొలగించేందుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనప్పటికీ, కొన్నిచోట్ల పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది.
ఇలాంటి కట్టడాలు 10వేల వరకు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. భూ సేకరణ చట్టం కింద వీరికి పరిహారం చెల్లించడమా? ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడమా? ఇతర మార్గాలేమిటనే కోణంలో అధ్యయనం చేస్తోంది. పాతబస్తీలో మూసీ కుచించుపోయిందున ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించే ఆలోచన కూడా చేస్తోంది.
జంట జలాశయాల నుంచి రోజూ నీరు
గుజరాత్‌లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లిన మాదిరే గోదావరిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు అనుసంధానం చేయాలనేది ప్రణాళిక. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు శుద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వరద నీరు, మురుగు నీరు కూడా నదిలో కలుస్తున్నందున మూసీ కలుషితం అవుతుందని తేలడంతో అమృత్ పథకం కింద 39 మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మిస్తోంది. వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి రోజు జంట జలాశయాల నుంచి నీటిని వదలడం ద్వారా నదీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా.. సందర్శకులను ఆకర్షించేలా రూపొందిస్తారు. మార్గమధ్యంలో పార్కులు, బోటింగ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సబర్మతి.. మూసీ
కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలో పుట్టి.. నార్సింగి ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి గౌరెల్లి ఓఆర్‌ఆర్ వరకు 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దేశంలోనే నది పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ల్లో మూసీ రివర్ ఫ్రంట్ అత్యంత ప్రతిష్టాత్మకం. నీటి నిర్వహణ, ప్రణాళిక, రవాణా, పునరావాసం, పట్టణ పునరుజ్జీవం తదితరాల కోసం రూ.60 వేల కోట్ల వ్యయం, సుమారు 36 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్‌లోని సబర్మతి నది పునరాభివృద్ధికి మూసీకి దగ్గరి పోలికలున్నాయి, కాకపోతే సబర్మతి అహ్మదాబాద్ నగరంలో 11 కి.మీ. మేర మాత్రమే విస్తరించి ఉండగా.. మూసీ నది హైదరాబాద్‌లో 55 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అదీగాక సబర్మతి కంటే మూసీ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ ఆక్రమణకు గురవడంతోపాటు జనసాంద్రత కలిగిన ప్రాంతాలు కావడం గమనార్హం.
ప్రాజెక్టు తొలి దశ అంచనా వ్యయమిలా
వెస్ట్ కారిడార్– ఈస్ట్ కారిడార్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.15,000 కోట్లు
ట్రంక్ లైన్‌కు రూ.3,000 కోట్లు
రివర్ లింకేజీకి రూ.3,000 కోట్లు
మూసీ మొత్తం పరీవాహక ప్రాంతం: 110 చ.కి.మీ.
ఆక్రమణలున్న ప్రాంతం: 55 చ.కి.మీ.
Comments
Please login to add a commentAdd a comment