పట్టణానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసే ఆర్చ్‌లు (ఊహాచిత్రం)
భీమవరం(ప్రకాశం చౌక్): నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం కొత్త శోభ సంతరించుకోనుంది. పట్టణ సుందరీకరణ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఇటీవల పట్టణ సుందరీకరణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించారు. మున్సిపల్ అధికారులకు సృష్టమైన ఆదేశాలు జారీచేశారు. దాంతో పట్టణ సుందరీకణ పనులపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులకు సంబంధించి డ్రాయింగ్స్, నమూనాలు, నిధులు, అంచనాలు తదితర వాటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇప్పటికే భీమవరంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద బట్టల దుకాణాలు, బంగారం షాపులు ఉన్నాయి. అలాగే ఆకర్షణీయమైన లైటింగ్స్, డైకరేషన్‌తో భీమవరం కళకళలాడుతోంది. చిన్న సైజు నగరాన్ని తలపిస్తోంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా చేసేందుకు వాటర్ ఫౌంటెన్లు, వాల్ బ్యాక్‌గ్రౌండ్ ఫౌంటెన్స్, పచ్చదనం, వెల్‌కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు.
వాటర్ ఫౌంటెన్లకు రూ. 45 లక్షల ఖర్చు
పట్టణ సుందరీకరణ పనులకు పలు రకాల నిధులు వాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు, సీడిఎంఏ, సీఎస్‌ఆర్ నిధులు ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేస్తారు. పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, బీవీ రాజు విగ్రహం సెంటర్లలో లైటింగ్ విత్ వాటర్ ఫౌంటెన్లును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సీఎస్‌ఆర్ నిధులు రూ.45 లక్షలు వెచ్చిస్తారు. ఒక్కొక్క ఫౌంటెన్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపడతారు.
6 చోట్ల స్వాగత ఆర్చ్‌లు
భీమవరం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించే ప్రధాన రోడ్లపై ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఉండి రోడ్డు, బీవీ రాజు రోడ్డు, గొల్లవానితిప్ప, పాలకొల్లు, జువ్వలపాలెం రోడ్డు, తణుకు రోడ్డులో ఈ ఆర్చ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వాటి నిర్మాణం కోసం మున్సి పల్ నిధులు రూ.90 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఒక్కొక్క ఆర్చ్‌కు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు.
పచ్చదనం కోసం రూ. 54 లక్షలు
పట్టణంలో పచ్చదనం (గ్రీనరీ) కోసం సీడీఎంఏ నిధులు రూ.54 లక్షలు ఉపయోగించుకోనున్నారు. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ప్రత్యేకమైన, అందమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతు న్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో యమనదుర్రు వంతెనకు అనుకుని గోడకు అందమైన చిత్రాలు వేయనున్నారు. అలాగే వాల్ ఫౌంటెన్ లేదా లైటింగ్ విత్ భీమవరం అని బోర్డు ఏర్పాటు చేస్తారు. ఇందుకు రూ.20 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు చేస్తారు. స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ నుంచి పోలీసు బొమ్మ సెంటర్ వరకు పీపీ రోడ్డు మధ్యలో రూ.15 లక్షల ఖర్చుతో డివైడర్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు.
ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
ప్రకాశం చౌక్ సెంటర్, అంబేద్కర్ సెంటర్‌లో భీమవరానికి సంబంధించి విషయాలు తెలియచెప్పేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సీఎస్‌ఆర్ నిధులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తారు. (క్లిక్: పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?)
సుందరీకరణ పనులకు ప్రతిపాదనలు పంపాం
కలెక్టర్ అదేశాలతో భీమవరం పట్టణం సుందరీకరణ పనులకు సంబంధించి అన్నీ సిద్ధం చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు, భీమవరం ప్రత్యేక అధికారికి పంపాం. పట్టణంలో మూడు చోట్ల ఫౌంటెన్స్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. మిగిలిన పనులకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి వాటి నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటాము.
– పి.శ్రీకాంత్, భీమవరం మున్సిపల్ ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment