సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా.. స్వాతంత్య్ర పోరాట విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.
ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతోను ప్రధాని ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు ముచ్చటించే అవకాశమే ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్–టు–మినిట్ కార్యక్రమ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మోదీ.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 – 10.40 గంటల మధ్య గన్నవరం ఎయిర్‌పోర్టుకు వస్తారు.
ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు, కొద్దిమంది బీజేపీ నాయకులు పాల్గొంటారు. తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి భీమవరం చేరుకుంటారు. అల్లూరి విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగసభలో ప్రధాని దాదాపు 50 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు వెల్లడించారు. ఆ సభలో ప్రధానితోపాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాత్రమే ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు రెండుగంటల పాటు ప్రధాని భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి ఢిల్లీ వెళతారని చెప్పారు.
భారీ వర్షం కురిస్తే..
ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. రానున్న రెండు రోజుల్లో భీమవరంలో భారీవర్షం కురిసిన పక్షంలో ప్రధాని రాష్ట్ర పర్యటన కొనసాగే అంశంలో సందేహాలున్నట్టు బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు ప్రస్తుతం భీమవరంలోనే ఉన్నారు.
విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన
ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లను శుక్రవారం కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ పి.జాషువా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు, సిబ్బందికి ఫొటో గుర్తింపు కార్డులు జారీచేయాలని ఆదేశించారు.
ఈ విధుల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలన్నారు. తొలుత విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్, ఇమ్మిగ్రేషన్, భద్రత తనిఖీ విభాగాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ తదితరులున్నారు. మరోవైపు ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎస్పీజీ దళాలతో పాటు కాన్వాయ్ వాహనాలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. ప్రధాని భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment