మఠం భూముల్లో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
సాక్షి, తిరుపతి: వందల కోట్ల విలువైన హథీరాంజీమఠం భూముల్లో భూమాఫియా తిష్టవేసింది. దొంగ పత్రాలు సృష్టించింది. కాసులతో రిజిస్ట్రేషన్ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వంలో ఈ పచ్చ భూమాఫియా స్వాహా చేసిన మఠం భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే.
కలెక్టర్ కన్నెర్ర..తహసీల్దార్ చిత్తశుద్ధి
మఠం భూముల్లో భూమాఫియా ప్రవేశంతో అవిలా ల, ఉప్పరపల్లి, మల్లంగుంట ప్రాంతాల్లో రోజు ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గతంలో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఇటీవల ఈ ఘర్షణలు పెరిగిపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు సైతం నమోదయ్యాయి. మఠం భూముల్లో జరుగుతున్న భూమాఫి యాపై కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త దృష్టి సారించారు. రి కార్డులు, కోర్టు కేసులను పరిశీలించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించా రు. మఠం భూముల్లో ఆక్రమణలను తొలగించాలని తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో అవిలాల లెక్కదాఖల సర్వే నెంబర్ 13లోని 107 ఎకరాల మఠం భూముల ప్రక్షాళనకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు రెండు రోజులుగా ఆక్రమణలను తొలగిస్తున్నారు.
254 ప్లాట్లలో ఆక్రమణల తొలగింపు
తహసీల్దార్ కిరణ్‌కుమార్, వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు 10 జేసీబీలతో సర్వే నెంబర్ 13లో ఆక్రమణలను ఆదివారం ఉదయం నుంచే తొలగించటం ప్రారంభించారు. వందల అంకణాలను ఆక్రమించి, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అందులో చిన్న షెడ్డు వేయడం, దానికి కరెంటు కనెక్షన్ తీసుకోవడం, ఎన్నో ఏళ్లుగా ఇళ్లు ఉన్నట్లు మస్కా కొట్టి కబ్జారాయుళ్లు మఠం భూములను మింగేస్తూ వచ్చారు. వారి ఆటలు ప్రస్తుత రెవెన్యూ, పోలీస్ అధికారుల ముందు పారలేదు. జేసీబీలతో సాయంత్రం వరకు 254 ప్లాట్లలోని ఆక్రమణలను తొలగించారు. అధికారుల ముక్కుసూటితనంలో కబ్జారాయుళ్లు, వారికి సహకరించిన రిజిస్ట్రేషన్, పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు వణికిపోతున్నారు. మఠం భూముల్లో భూ క్రయవిక్రయాలు చేసిన వారిపై పీడీ యాక్టుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. నీటి కనెక్షన్లు ఇచ్చి, ఇంటి పన్నులు వేసిన పంచాయతీ అధికారులు, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన విద్యుత్ అధికారులు, నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ల మెడకు ఉచ్చు బిగుస్తోంది.
మఠం పేదలకు తప్పక న్యాయం చేస్తాం: చెవిరెడ్డి
మఠం భూముల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపులో పేదలకు అన్యా యం జరిగి ఉంటే తప్పక న్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ ఆక్రమణదారుల నుంచి తెలియక మఠం స్థలాలను కొని, నష్టపోయిన పేదల కోసం 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ అధికారులతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము కొన్న స్థలాలకు సంబంధించిన ఏదైనా అగ్రిమెంట్/రిజిస్ట్రేషన్/పత్రాలు ఉంటే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్థలాలు కొల్పోయిన నిరుపేదలను గుర్తించి వారందరికి ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. పేదలను మోసగించి మఠం భూములను అంటకట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని, కాపురం ఉంటున్న పేదల ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని, వాటి రక్షణ తన బాధ్యత అని భరోసా కల్పించారు. ఇళ్లు కూలుస్తారని పేదలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment