భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో రియల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ‘అధికార’ అండ చూసుకుని అక్రమార్కులు చెలరేగిపోతుండడంతో...భవిష్యత్తులో తలనొప్పులు వస్తాయని ఓ రెవెన్యూ అధికారి ఏకంగా సెలవుపై వెళ్లిపోయారంటే ఏమేరకు దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చనే చర్చ ఇక్కడ నడుస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం వ్యాపారపరంగా కూడా దినాదినాభివృద్ధి చెందుతోంది. ఐటీడీఏ కార్యాలయంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో వివిధ మండలాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్తులు పట్టణంలో సిర్థ నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా భద్రాచలం జిల్లా కేంద్రమవుతుందనే ప్రచారం కూడా ఇక్కడ జరుగుతోంది.
సందర్శకుల తాకిడి అధికంగా ఉండడం, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందటంతో భద్రాచలంపై రియల్‌వ్యాపారుల కన్నుపడింది. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. శివారు ప్రాంతాల్లో సెంటు భూమి రూ.2 లక్షలు ఉండగా, భద్రాచలం నడిబొడ్డున సెంటు భూమి రూ.30 లక్షల వరకూ పలుకుతోంది. సామాన్యుడు చిన్నపాటి ఇంటి జాగా కొనుక్కోలేని పరిస్థితి ఉంది. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదు. కానీ ప్రస్తుతం యథేచ్ఛగా గిరిజన చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూనవరం రోడ్డులో కరకట్టకు ఆనుకొని, అదేవిధంగా గుండాల కాలనీ సమీపంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భద్రాచలం శివారు ప్రాంతంలో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
చెలరేగుతున్న మాఫియా :
ఓ రాజకీయ పార్టీ అండతో భద్రాచలంలో మాఫియా చెలరేగుతోంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ గతంలో ఇదే విషయమై ప్రస్తావించారు. సెటిల్‌మెంట్‌లకు అడ్డగా మారుతున్న భద్రాచలంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా ప్రకటించారు. కానీ కొంతమంది రె వెన్యూ అధికారుల అండతో ఈ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వీరు దర్జాగా ఆక్రమిస్తున్నారు. చర్ల రోడ్డులో గల పాలకేంద్రం, దానికి ఎదురుగా ఉన్న భూములు కూడా ప్రస్తుతం వివాదంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవటంతో ఆ స్థలాల్లో కొద్ది రోజులకే భవనాలు లేస్తున్నాయి.
వాటికి విద్యుత్ మీటర్‌లు కూడా మంజూరవుతున్నాయి. గిరిజన చట్టాలు ఇక్కడి కొన్ని శాఖల అధికారులకు కాసుల వర్షం కురుపిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎక్కడ లేని నిబంధనలు వల్లెవేసే విద్యుత్ శాఖ అధికారులకు రూ.20 వేలు చెల్లిస్తే మీటరు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాలకేంద్రం వద్ద ప్రభుత్వ భూముల్లో వేసిన ఇళ్లకు ఏ ప్రాతిపదికన విద్యుత్ మీటర్లు ఇచ్చారనే దానిపై విచారణ జరిపిస్తే అవినీతి అధికారులు బాగోతం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని పట్టణవాసులు అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారం ‘అధికార’ అండ కలిగిన కొంతమంది వ్యక్తుల కనుసన్నుల్లోనే సాగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రియల్ దందాలు, ఆక్రమణలు జోరుగా సాగుతున్న తరుణంలోనే భద్రాచలం తహశీల్‌దార్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భూ లావాదేవీల్లో ఇరుక్కోవటం ఇష్టం లేకనే తహశీల్‌దార్ సెలవుపై వెళ్లిపోయినట్లు పట్టణంలో ప్రచారం సాగుతోంది. ఆ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుండటం గమనార్హం.
అధికారుల హడావిడి
వెనుక ఆంతర్యమేమిటో..?
భద్రాచలం డివిజన్‌కు కొత్తగా రెవెన్యూ అధికారులు వచ్చినప్పడల్లా 1/70 చట్టాన్ని వెలికితీస్తుండం ఆనవాయితీగా మారుతోంది. గతంలో ఓ సబ్‌కలెక్టర్ విధులు చేపట్టిన కొత్తలో చట్టాల పరిరక్షణ పేరుతో నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి సామాన్లు కూడా సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆయన కార్యాలయం ముందరే బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా మౌనం దాల్చారు. ఇలా అధికారి వచ్చినప్పడల్లా చట్టాలు గుర్తొస్తుండటం, ఆనక వీటి గురించి పూర్తిగా మరిచిపోవటంపై గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గత రెండు రోజులుగా పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పట్టణంలోని చర్ల రోడ్‌లో గల పాలకేంద్రం భూములు, అదే విధంగా దానికి ఎదురుగా ఉన్న భూములను పరిశీలించారు. ఇన్‌చార్జి తహశీల్‌దార్ కనకదుర్గ, ఆర్‌ఐ మోహన్‌రావు ఆధ్వర్యంలో పలువురు వీఆర్‌వోలు ఆ స్థలాలను సర్వే చేశారు. దీంతో ఆ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేద వర్గాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్‌డీవో ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని తహశీల్‌దార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. హడావిడి సర్వేలు కాకుండా గిరిజన చట్టాలను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుందని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.
‘రియల్’ దందా...
Published Sat, Dec 21 2013 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement