ల్యాండ్ మాఫియా ఆగడాలు
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధిత శాఖాధికారులు హద్దులు వేయకపోవడంతో వందల ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని గుర్తించిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల సహాయంతో కబ్జా చేసుకుంటున్నారు. అనంతరం వాటిని ప్లాట్లుగా చేసి పేదలకు విక్రయిస్తున్నారు. నగర శివారులోని అసద్‌బాబా నగర్, నందిగుట్ట, కెనాల్‌కట్ట, దొడ్డి కొమురయ్యనగర్‌లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, నీటిపారుదల శాఖకు చెందిన భూములను కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేశారు.
ఈ స్థలంలో ప్లాట్లు చేసి అమాయక నిరుపేదలకు విక్రయిస్తున్నారు. నగరానికి చెందిన షబ్బీర్ అనే వ్యక్తి నందిగుట్ట ప్రాంతంలోని నిజాంసాగర్ కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు 3 వందల ప్లాట్లను చేసి విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌ను రూ. 3వేల నుంచి రూ. 5 వేలకు విక్రయించినట్లు సమాచారం. ఇది ప్రభుత్వ స్థలమని, ఇంత తక్కువ ధరకు ప్లాట్ రాదని తెలియని అమాయక నిరుపేదలు అతడిని నమ్మి మోసపోయారు. కొనుక్కున్న స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అయితే ఓ వర్గం విక్రయించిన స్థలంపై ల్యాండ్ మాఫియాలోని మరో వర్గం అధికారులకు ఫిర్యాదు చేస్తుండడంతో.. వారు దాడులు చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మంగళవారం ఇలాగే నందిగుట్ట ప్రాంతంలోని ఇరిగేషన్ స్థలంలో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చేశారు. తమకు ప్రభుత్వ స్థలాన్ని విక్రయించి, మోసం చేసిన షబ్బీర్‌పై చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.