governament lands
-
Telangana: ప్రభుత్వ భూముల అమ్మకాలకు మార్గదర్శకాలు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ భూముల విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకానుంది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకాల పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. -
కబ్జాకోరల్లో సర్కార్ భూమి
కేశ్వాపూర్లో రూ.2కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం పట్టించుకోని రెవెన్యూ అధికారులు హుస్నాబాద్‌రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువైన సర్కార్ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తలపట్టుకుంటున్నారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పేదదళితులకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. హుస్నాబాద్ మండలం కేశ్వాపూర్ గ్రామ పరిధిలోని జీడి గట్టు సమీపంలోని సర్వే నంబర్ 154లో 52ఎకరాల సాగుకు అనువైన ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2.20 ఎకరాలను గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించగా.. మిగిలిన భూమిలో గ్రామస్తులు గొర్లు, పశువులకు మేతకోసం వినియోగించుకునేవారు. ఇటీవల భూమి తమదేనంటూ 30 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల గ్రామ సందర్శనకు వచ్చిన తహసీల్దార్ టి.వాణికి ఫిర్యాదు చేశారు. 10ఎకరాలను గౌడ సంఘం, మరో 10 ఎకరాలను సరిహద్దులోని రైతుల, ధర్మారం శివారులో 10 ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని వివరించారు. ఇక్కడ ఎకరాకు రూ.4 లక్షలవరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన దాదాపు రూ.2కోట్ల భూమి కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పెట్టాలని గ్రామస్తులు కోరారు. పేదల దరిచేరని భూపంపిణీ పథకం ఎస్సీ, ఎస్టీల కుటుంబాల అభివద్ధి కోసం భూపంపిణీ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా హుస్నాబాద్ మండలంలో ఒకరికీ భూపంపిణీ జరగలేదు. కేశ్వాపూర్లో భూమిలేని ఎస్సీ కుటుంబాలు 20 వరకు ఉన్నాయి. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి భూమికొనుగోలు చేసే బదులు గ్రామంలో ఉన్న 60 ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. భూఅభివద్ధి పథకం కింద బావుల తవ్వకానికి రుణాలు మంజూరు చేస్తే ఆ కుటుంబాలు బతుకుతాయని ప్రజాప్రతినిధులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి కబ్జా భూములను స్వాధీనం చేసుకుని భూపంపిణీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూమికి హద్దులు పెట్టాలి సర్వే నంబర్ 154లో 50 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోంది. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినం. సర్వే చేసుడు లేదు.. భూమి ఇచ్చుడు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని సర్వే చేసి పంచాయతీకి అప్పగిస్తే హరితహారం కింద మొక్కలు పెంచుతాం. –గంధపు రమేశ్,సర్పంచ్ సర్వే చేసి హద్దులు వేస్తాం కేశ్వాపూర్లోని సర్వే నంబర్ 154లో 52 ఎకరాల భూమిలో 2.20ఎకరాల భూమిని గౌడ సంఘానికి ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఎవరికి ఎలాంటి భూపట్టాలు ఇవ్వలేదు. కబ్జా చేస్తున్న విషయాన్ని గ్రామస్తులు నా దష్టికి తెచ్చారు. దీనిపై సర్వే చేసి కబ్జా చేసిన భూమి స్వాధీనం చేసుకుంటాం. -
అక్రమబద్ధీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘క్రమబద్ధీకరణ’ మాటున ప్రభుత్వ స్థలాలకు రెక్కలొస్తున్నాయి. స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఉద్దేశించిన 166 జీవోకు వక్రభాష్యం పలుకుతూ రెవెన్యూ అధికారులే సర్కారీ స్థలాలను కొల్లగొట్టేందుకు వేసిన మరో ఎత్తుగడ ఆలస్యంగా వెలుగు చూసింది. భూ మాఫియాతో చేతులు కలిపి దాదాపు రూ.150 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అనుకూలంగా పావులు కదిపిన అధికారులపై చర్యలకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. స్థల ఆధీనానికి సంబంధించి నిర్దేశిత డాక్యుమెంట్లు సమర్పించనప్పటికీ, వాటిని సిఫార్సు చేసిన స్థానిక తహసీల్దార్ సహా అప్పటి ఆర్డీవోపై వేటు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వివరాల్లోకి వెళితే...ఉప్పల్ మండలం కొత్తపేట్ సర్వే నంబర్ 135లో మూడు ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. 2007 నాటి వరకు ఈ భూమి ఎలాంటి కబ్జాకు గురికాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించిన 166 జీవో జారీ అయిన అనంతరం రాత్రికి రాత్రే ఇక్కడ ఆక్రమణలు వెలిశాయి. క్రమబద్ధీకరణ చాటున ఈ స్థలాలను కైంకర్యం చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ మాఫియాతో కొందరు రెవెన్యూ అధికారులు చేతులు కలిపారు. ఎనిమిది మంది బోగస్ లబ్ధిదారులను సృష్టించి.. ఒక్కొక్కరి పేరిట వెయ్యి చదరపు గజాలను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన జిల్లా యంత్రాంగం అవాక్కయింది. కనీసం స్థల ఆక్రమణను ధ్రువీకరిస్తూ నిర్దేశించిన డాక్యుమెంట్లు లేకుండానే నివేదించడాన్ని తప్పుబట్టిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ పరిశీలన దశలోనే వాటిని పక్కనపెట్టింది. వ్యూహం బెడిసికొట్టడంతో... గంపగుత్తగా ప్రభుత్వ భూమిని కాజేద్దామనే వ్యూహానికి అడ్డుపుల్ల పడడంతో కబ్జాదారులు సరికొత్త ఎత్తుగడ వేశారు. 250 గజాల్లోపు స్థలాన్ని క్రమబద్ధీకరించే అధికారం కలెక్టర్‌కు ఉన్నందున.. విస్తీర్ణాన్ని తగ్గించారు. 250 గజాల వరకు కలెక్టర్‌కు, 500 గజాల్లోపు సీసీఎల్ఏకు, అపైబడిన వాటికీ ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రతిపాదిత స్థలాన్ని కుదించినట్లు కనిపిస్తోంది. అయితే, మూడు ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు దరఖాస్తుదారుల జాబితాను పెంచేశారు. సంబంధీకులు, కుటుంబ సభ్యుల పేర భాగ పరిష్కార(పార్టిషన్ డీడ్) హక్కులను సృష్టించారు. ఇలా 76 మంది అనర్హులను తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి 166 జీవో కింద స్థలాల క్రమబద్ధీకరణలో పార్టిషన్ డీడ్లు చెల్లవు. అయినప్పటికీ, ఇవేవీ పట్టించుకోని అక్రమార్కులు అధికారుల సలహాతో వక్రమార్గాలను ఎంచుకున్నారు. మరోసారి జిల్లా స్థాయి కమిటీకి నివేదించారు. ఈ ప్రతిపాదనలను సూక్ష్మంగా పరిశీలించని కమిటీ.. ఒకట్రెండు సవరణలు కోరుతూ ఫైల్‌ను తిప్పిపంపింది. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే అసలు కథ బయటపడింది. తీగ లాగితే ‘ఫైలు’ కదిలింది ఆక్రమణలు నిరోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ జాగాలకు జిల్లా యంత్రాంగం ప్రహరీలను నిర్మిస్తోంది. ఈ పనుల పురోగతి పరిశీలనకు జాయింట్ కలెక్టర్ చంపాలాల్ ఉప్పల్ మండలంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూమిగా పేర్కొన్న ఈ స్థలాన్ని కూడా చూసేందుకు ఇటీవల స్థానిక తహసీల్దార్‌తో కలిసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం స్థల స్థితిగతులను పరిశీలించిన జేసీకి ఆ ప్రాంతంలో వెలిసిన నిర్మాణాలపై సందేహం కలిగింది. విసిరేసినట్లుగా ఉన్న ఆక్రమణలను రెగ్యులరైజ్ చేయడం వెనుక మతలబు ఉన్నట్లు అనుమానించారు. అనుకున్నదే తడువుగా ఈ భూ వ్యవహారంపై విచారణ సాగించారు. ఈ విచారణలో ఆనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆక్రమణలు ప్రోత్సహించడం మొదలు... క్రమబద్ధీకరణ ఫైలు సృష్టించడం వెనుక స్థానిక రెవెన్యూ అధికారులు కీలక భూమిక పోషించినట్లు గమనించారు. 135 సర్వే నంబర్లో క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని మల్కాజిగిరి ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన ఆర్డీవో నలుగురు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ఈ తంతు జరిగిందని తేల్చినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేసిన విశ్రాంత తహసీల్దార్ సహా ఒక డిప్యూటీ కలెక్టర్ , మాజీ తహసీల్దార్ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని నిర్ధారించినట్లు సమాచారం. అంతేగాకుండా క్షేత్రస్థాయిలో స్థలాలను పరి శీలించకుండా ఏకపక్షంగా క్రమబద్ధీకరణకు సిఫార్సు చేసిన అప్పటి ఆర్డీవో పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. రూ. వందల కోట్ల భూమి ని అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ల్యాండ్ మాఫియా ఆగడాలు
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధిత శాఖాధికారులు హద్దులు వేయకపోవడంతో వందల ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. వీటిని గుర్తించిన అక్రమార్కులు రెవెన్యూ అధికారుల సహాయంతో కబ్జా చేసుకుంటున్నారు. అనంతరం వాటిని ప్లాట్లుగా చేసి పేదలకు విక్రయిస్తున్నారు. నగర శివారులోని అసద్‌బాబా నగర్, నందిగుట్ట, కెనాల్‌కట్ట, దొడ్డి కొమురయ్యనగర్లాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, నీటిపారుదల శాఖకు చెందిన భూములను కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేశారు. ఈ స్థలంలో ప్లాట్లు చేసి అమాయక నిరుపేదలకు విక్రయిస్తున్నారు. నగరానికి చెందిన షబ్బీర్ అనే వ్యక్తి నందిగుట్ట ప్రాంతంలోని నిజాంసాగర్ కెనాల్‌ను ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు 3 వందల ప్లాట్లను చేసి విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌ను రూ. 3వేల నుంచి రూ. 5 వేలకు విక్రయించినట్లు సమాచారం. ఇది ప్రభుత్వ స్థలమని, ఇంత తక్కువ ధరకు ప్లాట్ రాదని తెలియని అమాయక నిరుపేదలు అతడిని నమ్మి మోసపోయారు. కొనుక్కున్న స్థలంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అయితే ఓ వర్గం విక్రయించిన స్థలంపై ల్యాండ్ మాఫియాలోని మరో వర్గం అధికారులకు ఫిర్యాదు చేస్తుండడంతో.. వారు దాడులు చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మంగళవారం ఇలాగే నందిగుట్ట ప్రాంతంలోని ఇరిగేషన్ స్థలంలో పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చేశారు. తమకు ప్రభుత్వ స్థలాన్ని విక్రయించి, మోసం చేసిన షబ్బీర్‌పై చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.