సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘క్రమబద్ధీకరణ’ మాటున ప్రభుత్వ స్థలాలకు రెక్కలొస్తున్నాయి. స్థలాల రెగ్యులరైజేషన్‌కు ఉద్దేశించిన 166 జీవోకు వక్రభాష్యం పలుకుతూ రెవెన్యూ అధికారులే సర్కారీ స్థలాలను కొల్లగొట్టేందుకు వేసిన మరో ఎత్తుగడ ఆలస్యంగా వెలుగు చూసింది. భూ మాఫియాతో చేతులు కలిపి దాదాపు రూ.150 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అనుకూలంగా పావులు కదిపిన అధికారులపై చర్యలకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. స్థల ఆధీనానికి సంబంధించి నిర్దేశిత డాక్యుమెంట్లు సమర్పించనప్పటికీ, వాటిని సిఫార్సు చేసిన స్థానిక తహసీల్దార్ సహా అప్పటి ఆర్డీవోపై వేటు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
వివరాల్లోకి వెళితే...ఉప్పల్ మండలం కొత్తపేట్ సర్వే నంబర్ 135లో మూడు ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. 2007 నాటి వరకు ఈ భూమి ఎలాంటి కబ్జాకు గురికాలేదు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించిన 166 జీవో జారీ అయిన అనంతరం రాత్రికి రాత్రే ఇక్కడ ఆక్రమణలు వెలిశాయి. క్రమబద్ధీకరణ చాటున ఈ స్థలాలను కైంకర్యం చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ మాఫియాతో కొందరు రెవెన్యూ అధికారులు చేతులు కలిపారు. ఎనిమిది మంది బోగస్ లబ్ధిదారులను సృష్టించి.. ఒక్కొక్కరి పేరిట వెయ్యి చదరపు గజాలను క్రమబద్ధీకరించాలని ప్రతిపాదించారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన జిల్లా యంత్రాంగం అవాక్కయింది. కనీసం స్థల ఆక్రమణను ధ్రువీకరిస్తూ నిర్దేశించిన డాక్యుమెంట్లు లేకుండానే నివేదించడాన్ని తప్పుబట్టిన కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ పరిశీలన దశలోనే వాటిని పక్కనపెట్టింది.
వ్యూహం బెడిసికొట్టడంతో...
గంపగుత్తగా ప్రభుత్వ భూమిని కాజేద్దామనే వ్యూహానికి అడ్డుపుల్ల పడడంతో కబ్జాదారులు సరికొత్త ఎత్తుగడ వేశారు. 250 గజాల్లోపు స్థలాన్ని క్రమబద్ధీకరించే అధికారం కలెక్టర్‌కు ఉన్నందున.. విస్తీర్ణాన్ని తగ్గించారు. 250 గజాల వరకు కలెక్టర్‌కు, 500 గజాల్లోపు సీసీఎల్‌ఏకు, అపైబడిన వాటికీ ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రతిపాదిత స్థలాన్ని కుదించినట్లు కనిపిస్తోంది. అయితే, మూడు ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు దరఖాస్తుదారుల జాబితాను పెంచేశారు. సంబంధీకులు, కుటుంబ సభ్యుల పేర భాగ పరిష్కార(పార్టిషన్ డీడ్) హక్కులను సృష్టించారు. ఇలా 76 మంది అనర్హులను తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి 166 జీవో కింద స్థలాల క్రమబద్ధీకరణలో పార్టిషన్ డీడ్‌లు చెల్లవు. అయినప్పటికీ, ఇవేవీ పట్టించుకోని అక్రమార్కులు అధికారుల సలహాతో వక్రమార్గాలను ఎంచుకున్నారు. మరోసారి జిల్లా స్థాయి కమిటీకి నివేదించారు. ఈ ప్రతిపాదనలను సూక్ష్మంగా పరిశీలించని కమిటీ.. ఒకట్రెండు సవరణలు కోరుతూ ఫైల్‌ను తిప్పిపంపింది. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే అసలు కథ బయటపడింది.
తీగ లాగితే ‘ఫైలు’ కదిలింది
ఆక్రమణలు నిరోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ జాగాలకు జిల్లా యంత్రాంగం ప్రహరీలను నిర్మిస్తోంది. ఈ పనుల పురోగతి పరిశీలనకు జాయింట్ కలెక్టర్ చంపాలాల్ ఉప్పల్ మండలంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూమిగా పేర్కొన్న ఈ స్థలాన్ని కూడా చూసేందుకు ఇటీవల స్థానిక తహసీల్దార్‌తో కలిసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం స్థల స్థితిగతులను పరిశీలించిన జేసీకి ఆ ప్రాంతంలో వెలిసిన నిర్మాణాలపై సందేహం కలిగింది. విసిరేసినట్లుగా ఉన్న ఆక్రమణలను రెగ్యులరైజ్ చేయడం వెనుక మతలబు ఉన్నట్లు అనుమానించారు.
అనుకున్నదే తడువుగా ఈ భూ వ్యవహారంపై విచారణ సాగించారు. ఈ విచారణలో ఆనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆక్రమణలు ప్రోత్సహించడం మొదలు... క్రమబద్ధీకరణ ఫైలు సృష్టించడం వెనుక స్థానిక రెవెన్యూ అధికారులు కీలక భూమిక పోషించినట్లు గమనించారు. 135 సర్వే నంబర్‌లో క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని మల్కాజిగిరి ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన ఆర్డీవో నలుగురు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ఈ తంతు జరిగిందని తేల్చినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేసిన విశ్రాంత తహసీల్దార్ సహా ఒక డిప్యూటీ కలెక్టర్ , మాజీ తహసీల్దార్ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని నిర్ధారించినట్లు సమాచారం. అంతేగాకుండా క్షేత్రస్థాయిలో స్థలాలను పరి శీలించకుండా ఏకపక్షంగా క్రమబద్ధీకరణకు సిఫార్సు చేసిన అప్పటి ఆర్డీవో పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. రూ. వందల కోట్ల భూమి ని అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అక్రమబద్ధీకరణ
Published Fri, Dec 13 2013 2:01 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement