సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నించిన వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై వేటు వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై ఈ తతంగం నడిపించిన తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించింది. ఉప్పల్ మండలం కొత్తపేట సర్వే నం.135లో దాదాపు మూడెకరాల భూమిని 166 జీఓ కింద క్రమబద్ధీకరించేందుకు కొందరు రెవెన్యూ అధికారులు పావులు కదిపారు.
అక్రమార్కులతో మిలాఖత్ అయి.. మొత్తం భూమికే ఎసరు తెచ్చారు. కంచే చేను మేసినట్లు ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన యంత్రాంగమే వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఎత్తుగడ వేయడంతో నివ్వెరపోయిన కలెక్టర్ శ్రీధర్.. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ సహా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ట్లు తెలిసింది. మాజీ తహసీల్దార్ కనుసన్నల్లోనే ఈ అక్రమాలకు తెరలేచిందని మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ)కు లేఖ రాశారు. అంతేకాకుండా స్థానిక సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి ఈ వ్యవహారంలో అప్పటి ఆర్డీఓ సహా మరో ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉన్నప్పటికీ, ఈ తతంగంలో మాజీ తహసీల్దార్ ముఖ్య భూమిక పోషించినట్లు కలెక్టర్ గుర్తించారు.
166 జీఓకు వక్రభాష్యం చెబుతూ ప్రభుత్వ భూమిని ముక్కలుగా విడగొట్టి దరఖాస్తులు సమర్పించడంలో కబ్జాదారులకు సహకరించినట్లు పసిగట్టారు. దాంతో ఆయనపై చర్యలకు సిఫార్సు చేశారు. ఇదిలావుండగా.. క్షేత్రస్థాయిలో పరి శీలించకుండా అడ్డగోలుగా ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీకి నివేదించి న మరోఇద్దరు అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని జిల్లా యంత్రాం గం నిర్ణయించింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ కూడా ఈ భూ బాగోతంలో పాలుపంచుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినందున.. వీరి మెడకూ ఉచ్చు బిగియనుంది. ఈ తతంగంలో వ్యూ హాత్మకంగా వ్యవహరించిన ఆర్డీఓకు ప్రభుత్వ ఆశీస్సులు ఉండడంతో చర్యలపై అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇదిలావుండగా.. 135 సర్వేనంబర్‌లో 166 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న బోగస్ దరఖాస్తులన్నింటినీ తిరస్కరిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పించారు.
అక్రమార్కులపై వేటు!
Published Wed, Dec 18 2013 3:15 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement