భూదాహం
- కోట్లాది రూపాయల విలువైన భూమిపై మంత్రి అనుచరుల కన్ను
- ఓ వ్యక్తికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం
- కోర్టులో కేసు నడుస్తున్నా సెటిల్‌మెంట్‌కు అధికారులపై ఒత్తిడి
మైలవరం/విజయవాడ : ‘తెలుగు తమ్ముళ్ల’ భూదందాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విజయవాడ చుట్టు పక్కల ఉన్న భూములను ఎలాగైనా దక్కించుకుని కోట్లాది రూపాయలు ఆర్జించాలని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కోర్టుల్లో ఉన్న భూములను సైతం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే నిబంధనలను తుంగలో తొక్కాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే తరహాలో ఓ జమిందారుకు చెందిన భూమిని కాజేసేందుకు జిల్లాకు చెందిన మంత్రి అనుచరులు ప్రయత్నించడం వివాదాస్పదమైంది.
గణపవరం జమిందారు భూమి కోసం పట్టు..
మైలవరం మండలం గణపవరం గ్రామ జమిందార్ దివంగత బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డికి కోడూరు గ్రామంలో సర్వే నంబర్ 22, 23లో 27.22 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఇది పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి. ఈ భూమిని గణపవరం గ్రామానికి చెందిన గుంటక వెంకటేశ్వరరెడ్డి 2009లో అతి తక్కువ ధరకు తన భార్యపేరుతో కోనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు వెంకటేశ్వరరెడ్డి మనుమడు బొల్లారెడ్డి యువరాజ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.
అయినప్పటికీ ఈ భూమిని వెంకటేశ్వరరెడ్డి తన భార్య, సోదరి పేరుతో జమిందార్ వెంకటేశ్వరరెడ్డితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై యువరాజ్ రెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 90 ఏళ్ల వయసులో ఉన్న జమిందార్ వెంకటేశ్వరరెడ్డికి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమి కొన్నేళ్లుగా తన అనుభవంలో ఉందని, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కావడంతో దీనిలో తనకు కూడా హక్కు ఉందని, అందువల్ల ఈ అమ్మకం చెల్లదని యువరాజ్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీంతో కోర్టు 2010 జూన్ 6వ తేదీన ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ భూమికి సంబంధించి గుంటక వెంకటేశ్వరరెడ్డి భార్య అన్నపూర్ణ, సోదరి శారదలు పట్టాదారు పాసుపుస్తకాల కోసం గతంలో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఈ భూమి యువరాజ్‌రెడ్డి ఆధీనంలో ఉండటం, వివాదం నడుస్తుండటంతో పాస్‌పుస్తకాలు ఇవ్వడం సాధ్యం కాదని ఎండార్స్‌మెంట్ ఇచ్చారు.
అదే సమయంలో సదరు భూమిని ఆక్రమించడానికి జి.వెంకటేశ్వరరెడ్డి వర్గీయులు యత్నించడంతో వివాదం చెలరేగింది. అసలు ఈ భూ లావాదేవీపై విచారించాలని అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి జి.కొండూరు తహశీల్దారును ఆదేశించారు. అప్పటి తహశీల్దారు బిక్షారావు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డిని వ్యక్తిగతంగా విచారించగా, తనకు వయోభారం వల్ల మతిస్థిమితం సరిగా ఉండటం లేదని, ఆ భూమికి సంబంధించిన ఏ విషయమైనా తన మనవడు యువరాజ్‌రెడ్డి చెప్పినట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తహశీల్దార్ తన నివేదికలో పేర్కొని కలెక్టర్‌కు సమర్పించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడి..
ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ఉపయోగించుకుంటూ ఆయన పీఏగా వ్యవహరిస్తున్న ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. జి.వెంకటేశ్వరరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ రెండు నెలల క్రితం కోడూరు గ్రామంలో 145 సెక్షన్ కూడా విధింపజేసి పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలను సైతం భయభ్రాంతులకు గురి చేశారు.
స్థానిక ఎస్‌ఐ నుంచి వచ్చిన సూచనను కనీసం క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా జి.కొండూరు తహశీల్దార్ 145 సెక్షన్‌ను విధించడంపై యువరాజ్‌రెడ్డి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో తహశీల్దార్ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. తాజాగా ఈ భూమిలోకి ప్రవేశించడమే కాకుండా దాన్ని ఏదో ఒక విధంగా సెటిల్ చేయాలని మంత్రి అనుచరులు స్థానిక తహశీల్దార్, పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ వివాదం గురించి ‘సాక్షి’ మైలవరం తహశీల్దార్ వద్ద ప్రస్తావించగా తనకేమీ తెలియదని చెప్పారు. అప్పట్లో ఎస్‌ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 145 సెక్షన్ విధించామని దాటవేశారు. కోర్టులో ఉన్న అంశంపై మంత్రి అనుచరులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని యువరాజ్ రెడ్డి ప్రతినిధి డి.శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇప్పటికే తాము అధికారులను కలిసి కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అందజేశామని ఆయన చెప్పారు.