గుంటూరు సిటీ : రాజధాని ప్రాంతంగా అధికార తెలుగుదేశం ఏకపక్షంగా నిర్ణయించిన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరిట ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించింది పోగా ఇక మిగిలిన జరీబు భూముల పరిరక్షణకు సమరశంఖం పూరిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రకటించారు. శనివారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అందులో భాగంగానే ఈనెల 23వ తేదీన పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు వెల్లడించారు.
శాసనసభాపక్షంతో పాటు రాజధాని రైతులు, కౌలురైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ కూడా పర్యటనలో భాగస్వాములవుతున్నట్టు చెప్పారు. రాజధాని నిర్మాణానికి తాము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదని మర్రి రాజశేఖర్ పునరుద్ఘాటించారు. అందుకే ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చేందుకు అంగీకరిస్తూ పత్రాలిచ్చిన రైతాంగాన్ని ఎన్నడూ తాము వ్యతిరేకించలేదన్నారు. భూములివ్వలేమని ఖరాఖండీగా తేల్చి చెబుతున్న రైతాంగం గురించే తమ ఆందోళన అంతా అని ఆయన వివరించారు. అవన్నీ ఏడాది పొడవునా మూడు, నాలుగు పంటలు పండే జరీబు భూములని తెలిపారు. వాటి జోలికొస్తే మాత్రం చేతులు ముడుచుకుని కూర్చునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. అలాగని అంగీకార పత్రాలు ఇచ్చిన రైతాంగానికి భవిష్యత్తులో అన్యాయం జరిగినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
భూములిచ్చిన రైతులతో పాటు ఆ పొలాల్లో ఇప్పటి వరకు సాగు చేస్తున్న కౌలురైతులు, ఆ పంటలను ఆధారం చేసుకుని పొట్ట పోసుకునే కూలీలు, చేతివృత్తిదారులకు న్యాయం జరిగే వరకు తాము చేపట్టిన పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. అధికారికంగా 22,500ఎకరాల భూమిని పూలింగ్‌లో సేకరించినట్లు వారు చెబుతున్నారనీ, ఆయా భూముల్లో కౌలుదారులకు ఏ విధమైన న్యాయం చేస్తారో ముందే ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే రైతుకూలీలకు ఇస్తామంటున్న 2,500 ఏ మూలకూ సరిపోదన్నారు. ఇక జరీబు భూములున్న గ్రామాలను మాత్రం తక్షణం సీఆర్‌డీఏ పరిధి నుంచి మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
రేపు జరీబు భూముల సందర్శన..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి శాసనసభా పక్షం, రాజధాని రైతులు, కౌలురైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ బృందం సంయుక్తంగా బయలుదేరి రాజధాని గ్రామాలకు చేరుకుంటుందని మర్రి రాజశేఖర్ తెలిపారు. తుళ్ళూరు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్ళాయపాలెం,మందడం తదితర గ్రామాలతో పాటు ప్రత్యేకించి జరీబు పొలాలను సందర్శిస్తారని వివరించారు. అక్కడి రైతులు, కౌలుదారులు, కూలీలతో మమేకమై వారి సాదకబాధకాలను స్వయంగా పరిశీలన చేస్తారన్నారు.
తద్వారా అక్కడి రైతుల్లో ఒక నమ్మకాన్ని, భరోసాను కలిగించడమే కాక రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇదో ప్రత్యేక అంశంగా దీనిపై తాడోపేడో తేలుస్తారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు స్వచ్ఛందంగా 23నాటి కార్యక్రమానికి తరలివచ్చి రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించాలని మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో తాడికొండ నియోజకవర్గ నేత కత్తెర సురేష్‌కుమార్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కోవూరి సునీల్‌కుమార్, జిల్లా సేవాదళ్ కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గానుగపంట ఉత్తంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శిఖా బెనర్జీ, జిల్లా కార్యదర్శి యనమల ప్రకాష్, నాయుడు నాగేశ్వరరావు, శివారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెన్నా రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక సమరమే..
Published Sun, Feb 22 2015 3:16 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement