చేయి తడిపితేనే సర్వే
► దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయరు
► చేశామంటూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు
► కాసులివ్వందే కాలు కదపరనే ఆరోపణలు
► సర్వే, భూ రికార్డుల శాఖ తీరిది..!
డి.శకుంతలకు కణేకల్ మండలం ఉడేగోళం గ్రామం పొలం సర్వే నెంబరు 185-బి2లో ఐదు ఎకరాల భూమి ఉంది. తన భూమిని సర్వే చేయించుకునేందుకు 2015, జూన్ 6న మీ-సేవాలో (011500298958) దరఖాస్తు చేసుకుంటూ చలనా రూ.285 చెల్లించింది. ఏడాదవుతున్నా ఆ భూమిలో సర్వే చేయలేదు. మీ సేవా నెంబర్ ప్రకారం కంప్యూటర్‌లో పరిశీలిస్తే సర్వే పూర్తి చేసినట్లు (అప్రూవ్డ్) అప్‌లోడ్ అయ్యింది. అభ్యంతరాలు ఉంటే రిజెక్ట్ చేయాలి. అలా కాకుండా అప్రూవ్డ్ అని నమోదు చేశారు. అంటే ఇక్కడ సర్వే చేయకుండానే చేసినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలాంటివి ఈశాఖలో సర్వసాధారణమైపోయాయి.
అనంతపురం అర్బన్: సర్వే, భూ రికార్డుల శాఖలో తిర‘కాసు’ వ్యవహారాలకు అదుపు లేకుండా పోతోంది. భూముల సర్వే చేయించుకునందుకు వచ్చేవారికి ఇక్కడి ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. మీ-సేవలో దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయరు... సరికదా చేసేసినట్లుగా అప్రూవ్డ్ అంటూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇక్కడ కాసులివ్వందే ఏ ఫైలు కదపరనే ఆరోపణలున్నాయి. మామూలుగా అయితే సర్వే కోసం మీ-కోసంలో చలనా కట్టి దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా సమస్య పరిష్కరించాలి. అయితే ఇక్కడ ఏడాదైనా పనులు జరగవు. పైగా పూర్తి చేసినట్లుగా రికార్డుని చూపిస్తారు. ఇదంతా కాసులు దండుకునే ప్రయత్నంలో భాగమేననే విమర్శలు వినవస్తున్నాయి. మీ-సేవాలో చలానా కట్టిన తరువాత రసీదుని సంబంధిత సర్వేయర్ వద్దకు తీసుకెళ్లి ఆయన వెంటపడి ముడుపులు ముట్టజెబితే కాని పనిచేయరన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
కొందరు సర్వేయర్ల అక్రమార్జన నెలకు రూ.లక్షపైగానే ఉంటుందని ఆ శాఖలోకి కొందరు బహిరంగంగానే చెప్పుకుంటారు. వీరు ప్రతి రోజు రూ.5 వేలకు తక్కువ కాకుండా దండుకుంటారంటున్నారు. రెవెన్యూ శాఖలో భాగమైన సర్వే, భూ రికార్డుల శాఖను పక్షాళన చేయాల్సిన అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక కూడా మతలబుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులొస్తే చర్యలు
సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా సర్వే చేయాల్సిందే. ఒకవేళ వారు చేయకపోతే ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. డి.శకంతలకు చెందిన భూమి సర్వే చేయకుండా అప్రూవ్డ్ అని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పు. పరిశీలించి చర్యలు తీసుకంటాం. సర్వే కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. - టి.శ్రీనివాసులు రెడ్డి, సహాయ సంచాలకులు