Land Records Department
-
మరింత వేగంగా రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయనుంది. ఇందు కోసం కొత్తగా మరో 10 డ్రోన్లు కొనుగోలు చేసింది. విటాల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెండర్ల ద్వారా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ఈ డ్రోన్లు కొనుగోలు చేసింది. ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా, కొన్ని ప్రైవేటు డ్రోన్ ఏజెన్సీలను నియమించుకుని సర్వే చేయిస్తోంది. సర్వేను వేగంగా జరిపేందుకు గతంలో సర్వే శాఖ సొంతంగా 20 డ్రోన్లు కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో 10 డ్రోన్లు సమకూర్చుకుంది. వీటి కోసం 20 మంది సర్వేయర్లకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ సర్వేయర్లనే సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా తయారు చేసింది. ఇలా ప్రభుత్వ డ్రోన్లను ప్రభుత్వ సర్వేయర్లే నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లతో సమానంగా రాష్ట్ర సర్వే శాఖ డ్రోన్లు కూడా ఇప్పుడు కీలకంగా పని చేస్తున్నాయి. రోజుకు 100 నుంచి 150 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ ఫ్లై చేస్తూ సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. శీతాకాలం కావడంతో వాతావరణం అనుకూలంగా ఉంటుందని, సర్వే వేగంగా చేయవచ్చని సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆరు నెలలు.. 4 వేల గ్రామాలు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి మరో 4 వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్, ఇతర అధికారులతో ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి లక్ష్యాలను నిర్దేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించిన విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి 2 వేల గ్రామాలు, మే నాటికి మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఇటీవలే 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 8 లక్షల మంది భూయజమానులకు హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో వచ్చే 6 నెలల్లో 4 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు అధికారులు చర్యటు చేపట్టారు. తక్షణ పరిష్కారమే లక్ష్యంగా రీ సర్వే చేసే క్రమంలో జారీ చేసే నోటీసుల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ చేయకూడదని కలెక్టర్లకు సీసీఎల్ఏ సాయిప్రసాద్ స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియలో గ్రామ కార్యదర్శి, వీఆర్వో సహా గ్రామ సచివాలయ బృందం మొత్తం భాగస్వామ్యం కావాలని సూచించారు. సరైన సమాచారం లేని కారణంగా భూ హక్కు పత్రాలు జారీ కాని కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పట్టాదారు మృతి చెందడం, ఖాతా నంబర్, పాత సర్వే నంబర్ తప్పుకావడం, విస్తీర్ణం సరిపోకపోవడం వంటి కారణాలతో ఆగిపోయిన పత్రాల జారీ కోసం వెంటనే చర్యలు తీసుకుని పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన భూ హక్కు పత్రాల్లో దొర్లిన తప్పుల్ని సరిచేసే వెబ్‌ల్యాండ్–2 వ్యవస్థ ఈ నెల రెండో వారానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తుది ఆర్ఓఆర్లో కూడా తప్పుల్ని సరి చేసుకునేందుకు ఉన్న అవకాశాల గురించి ప్రజలకు తెలిసేలా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతినెలా రీ సర్వేపై తహసీల్దార్లు, మొబైల్ మెజిస్ట్రేట్లు, ఇతర రెవెన్యూ అధికారులకు కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమైన అంశాలను వివరించాలని ఆదేశించారు. వచ్చే 2, 3 నెలల్లో రాష్ట్రంలోని 17,460 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సూచించారు. -
ఏపీ సర్కార్ కొత్త చరిత్ర.. మీ భూమి మా హామీ
సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సాకారం చేసి కొత్త చరిత్రను లిఖిస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు)తో జారీ చేయనుంది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ జారీ చేయనున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ తరహాలో ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నెంబర్), క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. ఉచితంగా.. రికార్డు వేగంతో తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం పట్టే సమయం, తిప్పలు అందరికీ తెలిసిందే. అయితే రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్ డివిజన్ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూ.600 చెల్లించాలి. మ్యుటేషన్ కోసం అయితే రూ.100 కట్టాలి. ఈ లెక్కన 4.3 లక్షల పట్టా సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లను రైతులు సొంతంగా చేసుకోవాలంటే రూ.37.57 కోట్లు ఖర్చవుతుంది. రీసర్వే ద్వారా ప్రభుత్వమే ఉచితంగా ఈ పనుల్ని చేపట్టి రైతులకు డబ్బులు మిగల్చడంతోపాటు వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించింది. 2 వేల గ్రామాల్లో రీ సర్వేను కేవలం 8–9 నెలల్లోనే పూర్తి చేయడం రికార్డు. మరో 15 రోజుల్లో ఈ గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్ఎస్), జీఎన్ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు. భూహక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడం రీ సర్వే ప్రధాన లక్ష్యం. ప్రతి భూమికీ జియో కో–ఆర్డినేట్స్‌తో హద్దులు ఏర్పరచడం, ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ జారీ ద్వారా దేశంలో నవ శకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాంది పలికింది. రూ.1,000 కోట్ల అంచనా వ్యయం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్ డెస్క్ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా మహాయజ్ఞం రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మండల మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించారు. 2,797 మంది వీఆర్ఓలు, 7,033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3,664 మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రీసర్వేలో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 6,819 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా 47,276 చదరపు కిలోమీటర్లను సర్వే చేశారు. 2 వేల గ్రామాల్లో రీసర్వే అన్ని దశలు పూర్తైంది. అందులో 1,835 గ్రామాలకు సంబంధించి 7,29,381 మంది రైతుల భూహక్కు పత్రాలు జారీ అయ్యాయి. హక్కు పత్రాల పంపిణీ ద్వారా రీ సర్వే మహా యజ్ఞ ఫలాలను సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. ప్రతి దశలో రైతుల భాగస్వామ్యం రీ సర్వే ప్రతి దశలోనూ రైతులను భాగస్వాముల్ని చేస్తున్నాం. భూరక్ష, భూహక్కు కల్పిస్తున్నాం. సర్వే తర్వాత కూడా ఏమైనా తప్పులుంటే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సరిచేస్తాం. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 4.5 లక్షల సబ్ డివిజన్లు, 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. ఇవన్నీ 8 నెలల్లోనే చేశాం. – జి సాయిప్రసాద్, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అత్యంత వేగంగా రీ సర్వే తక్కువ సమయంలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశాం. దేశంలో ఇంత తక్కువ సమయంలో సర్వే చేయడం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. కొత్త రెవెన్యూ రికార్డులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుంది. లక్షల మంది పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చడం, పెద్ద ఎత్తున మ్యుటేషన్లు, సబ్ డివిజన్లు చేయడం గొప్ప విషయం. రీసర్వే తర్వాత కూడా రైతులు ఎప్పుడైనా తమ రికార్డులను అప్డేట్ చేసుకోవచ్చు. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ -
ఆధార్ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూమి ఉన్నది 20 గుంటలే... కానీ మార్కెట్లో దాని ధర కోట్లు పలుకుతోంది. ఆ భూమి యజమాని దాదాపు రెండేళ్ల క్రితం మరణించారు. సదరు యజమాని కుటుంబీకులు ఆ భూమిని తమ పేరు మీద బదలాయించుకోలేదు. దీన్ని గమనించిన కొందరు ప్రబుద్ధులు భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారు. ఒక్క ఆధార్ నంబర్‌తో అప్పనంగా భూమిని సొంతం చేసుకుందామనుకున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో అసలు విషయం తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలో సర్వే నంబర్ 497/ఇలో 20 గుంటల భూమి ఉంది. గత ఏప్రిల్ 19న తోట హనుమంతరావు పేరుతో ధరణి పోర్టల్‌కు ఒక దరఖాస్తు వచ్చింది. ఆ భూమికి ఈకేవైసీ కోసం తన ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని ఆ దరఖాస్తులో కోరారు. దీన్ని విచారిస్తుండగానే మే 6న తోట కనకదుర్గ పేరుతో మరో దరఖాస్తు వచ్చింది. తన భర్త తోట హనుమంతరావు 2019, ఆగస్టు 9న మరణించారని, ఆయన పేరు మీద ఉన్న భూమిని తనకు వారసత్వ మార్పు చేయాలని కనకదుర్గ కోరారు. రెండు దరఖాస్తుల్లోని సర్వే నంబర్లు, ఖాతా నంబర్లు ఒకటే ఉండటంతో జూన్ 5న విచారణకు రావాలని ఇరుపార్టీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ధ్రువీకరణలు తీసుకుని సదరు భూమిని క్లెయిమ్ చేసుకోవాలని కోరారు. పౌరసరఫరాల డేటా బేస్‌తో.. విచారణ సమయంలో తోట హనుమంతరావు పేరు మీద దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమికి సంబంధించిన ధ్రువీకరణలు చూపలేకపోయాడు. ఆ వ్యక్తి నమోదు చేయాలని కోరిన ఆధార్ కార్డులోని చిరునామాలో ఎంక్వైరీ చేయగా సదరు పేరున్న వ్యక్తి అక్కడ లేడని తేలింది. పౌరసరఫరాల డేటాలో వెతకగా ఆ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న రేషన్‌కార్డు దొరికింది. ఈ కార్డులో తోట హనుమంతరావు కాకుండా గుర్రం పాండు అనే పేరు వచ్చింది. ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాగా, ఆ రేషన్‌కార్డుపై తన బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసి 2020, నవంబర్‌లో రేషన్ బియ్యం తీసుకున్నాడని, ఆ తర్వాత వరుసగా అతని భార్య ఈ రేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. రెవెన్యూ అధికారులు మరింత విచారించగా, గుర్రం పాండు తన ఆధార్ కార్డులోని పేరును తోట హనుమంతరావుగా 2021లో మార్చుకున్నాడని, ఆ తర్వాత అదే పేరుతో ఆ కార్డులోని నంబర్‌ను నమోదు చేసుకుని విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నాడని తేలింది. దీంతో గుర్రం పాండుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సంబంధిత తహశీల్దార్ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు దరఖాస్తులు రావడంతోనే.. వాస్తవానికి రెండు దరఖాస్తులు ఒకే సమయంలో రావడంతోనే ఇది గుర్తించగలిగాం. లేదంటే ఆధార్‌కార్డులోని పేరు, పహాణీలో పేరు చూసి ఆ దరఖాస్తును ఆమోదించడమో, తిరస్కరించడమో జరిగేది. విచారణలో తప్పని తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ భూమి రికార్డులను ఆన్లైన్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. –కె. మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు తహశీల్దార్ -
తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
యాచారం: భూరికార్డులు ధరిణి వెబ్సైట్లో నమోదు చేయడం లేదని ఓ రైతు తహసీల్దార్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైతులు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆ రైతు చేతిలో ఉన్న పురుగుల మందును లాక్కోవడంతో ప్రాణపాయం తప్పింది. యాచారం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పదేళ్ల క్రితం సర్వే నంబరు 877లో గ్రామానికి చెందిన వల్లవోతు మల్లయ్య, మైసయ్య రైతుల వద్ద ఎకరా భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యూటేషన్ చేయించుకున్న రైతు జంగయ్య ఆన్లైన్లో నమోదు చేసుకోలేదు. కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందిస్తుండడం వల్ల ఆ డబ్బులు వస్తాయని ఆశతో ఏడాదిగా యాచారం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యవారిగూడెం రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను పలుమార్లు కలువగా స్పందన లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం సాయంత్రం రెవెన్యూ కార్యదర్శులను బదిలీ చేయడంతో రెవెన్యూ కార్యదర్శి జగదీష్ బదిలీ అయిపోతే తనకు రైతుబంధు రాదోనని ఆందోళనకు గురైన రైతు జంగయ్య శుక్రవారం ఉయం 10.30 గంటల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దే ఉన్నాడు. ఎకరా భూమి ఆన్లైన్ నమోదు చేసే విషయంలో సరైన విధంగా స్పందన లేకపోవడంతో మనుస్తాపానికి గురైన జంగయ్య సాయంత్రం 4 గంటల సమయంలో యాచారం వెళ్లి పురుగులు మందు కొనుగోలు చేసుకుని వచ్చి తహసీల్దార్ పుష్పలత ఎదుటే తన భూమి ఆన్లైన్లో నమోదు చేస్తారా... లేదా చవమంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతలోనే చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా మూతి తీసి తాగేలోపే అక్కడే రైతులు, రెవెన్యూ సిబ్బంది గమనించి పురుగుల మందు సీసాను లాక్కొన్నారు. క్షణాల్లోనే జరిగిన సంఘటనకు ఉలికిపడిన తహసీల్దార్ రైతుపై తీవ్రంగా మండిపడుతూ చస్తారా... చస్తే భూమి ఆన్లైన్ అవుతుందా.. ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకరావాలి అంటు అన్నారు. రెండు రోజుల్లో నీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆ రైతు శాంతించి వెళ్లిపోయాడు. ఇదే విషయమై రెవెన్యూ కార్యదర్శి జగదీష్‌ను సంప్రదించగా అయ్యవారిగూడెంలోని 877 సర్వే నంబరులో 10.21 ఎకరాలు భూమి ఉండగా, ఎకరా భూమి అదనంగా నమోదైందని, ఆ భూమిని తహసీల్దార్ అనుమతితో రికార్డుల నుంచి తొలగించడం కోసం ఆర్డీఓ అనుమతి కోసం పంపాను. రెండు, మూడు రోజుల్లో సరిచేస్తానని తెలియజేశాను. ఇంతలో ఆ రైతు ఆత్మహత్యయత్యానికి యత్నించడం బాదేసిందని అన్నారు. రైతు జంగయ్య రైతును ఇబ్బంది పెట్టలేదని, సాంకేతిక సమస్య వల్ల ఆన్లైన్లో ఎకరా భూమి నమోదు చేయలేదని తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం ఎప్పుడో..?
సాక్షి, జైనథ్: భూముల రిజిస్ట్రేషన్ అంటేనే ఓ పెద్ద తతంగం..దీని కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రానికి వెళ్లడం.. ఛలాన్ కట్టడం...సాక్షులను రప్పించడం..ఇలా ఎన్నో ఇబ్బందులు మనం సాధారణంగా చూస్తుంటాం.. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా అధికారుల చేయి తడపందే పనులు జరగవనేవి ఎవరూ కాదనలేని సత్యం.. ఇవన్నీ చేసి పెట్టేందుకు బ్రోకర్‌ను వెతకడం... నేరుగా వెళితే పనులు జరగకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో సమస్యలు, మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా నానా తంటాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని రెవెన్యూ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించుకోవడం మరో తలనొప్పిగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, మండల కేంద్రాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పిన ప్రభుత్వం దీంట్లో భాగంగానే 2018లో మండల కేంద్రంలో సైతం రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. దీంతో మండల వాసులు రిజిస్ట్రేషన్ సేవలు ఎప్పుడు ప్రారంభమౌతాయా? అని ఎదురు చూస్తున్నారు. రూ. 6లక్షలతో కార్యాలయంలో వసతులు మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంగా తయారు చేసారు. కొత్తగా నిర్మించిన స్త్రీశక్తి భవనం ఐకేపీకి కేటాయించడంతో ఈ పాత భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. బయట, లోపల రంగులు వేయడంతో పాటు అవసరమైన మేర గదులను తయారు చేస్తున్నారు. ఈ భవనంలో కంప్యూటర్లు, ఇతర పరికరాలకు ఏసీ తప్పనిసరి కావడంతో, ప్రత్యేకంగా కిటికీలు, అద్దాలు బిగించి రెండు ఏసీ యూనిట్లు అమర్చారు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కోసం ప్రత్యేకమైన క్యాబిన్, వినియోగదారుల కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేసారు. స్లాబ్ కొంత శిథిలావస్థకు చేరడంతో వాటర్‌ప్రూఫ్ రసాయనాలతో పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. రూ. 6లక్షల ఖర్చుతో ఈ పాత భవనం పూర్తిగా ఆధునిక హంగులతో మెరిసిపోతుండటంతో మండల కేంద్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. అయితే ప్రస్తుతం ఈ భవనం నిరుపయోగంగా ఉండటంతో రాత్రి వేళ మందుబాబులకు అడ్డగా మారింది. భవనం ముందరి భాగంలో వరండా ఉండటంతో రాత్రుళ్లు సిట్టింగ్ జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ భవనం చుట్టుపక్కల మందు బాటిళ్లు, డిస్పో గ్లాసులు, ఖాళీ వాటర్ ప్యాకెట్లతో నిండిపోయింది. గంటలోపే మ్యుటేషన్.. మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అందుబాటులోకి వస్తే ఏదైన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన గంటలోపే మ్యుటేషన్ కూడా చేసేలా ఏర్పాటు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మిన వ్యక్తి పట్టపాస్ బుక్ నుంచి భూమి తొలగించి, కొన్న వ్యక్తి పాస్‌బుక్‌లో భూమిని కలపడం పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగిపోతుంది. అక్కడే ఇద్దరికి కొత్త పాస్‌బుక్‌లు కూడా ప్రింట్ తీసి ఇస్తారు. దీంతో ఇరువర్గాల వాళ్లు రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి తీరనుండటంతో పాటు పారదర్శకత పెరిగి, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో మండల వాసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆదేశాలు రాలేదు.. ఉన్నత అధికారుల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభానికి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. మండల కేంద్రంలో ఇప్పటికే కార్యాలయం ఏర్పాటు చేశాం. కార్యాలయానికి కావాల్సిన కంప్యూటర్లు, ఏసీ, ఇతరత్ర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కార్యాలయాన్ని ప్రారంభించి, సేవలు మొదలు పెడుతాం. –సత్యనారాయణ యాదవ్, తహసీల్దార్ -
చేయి తడిపితేనే సర్వే
► దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయరు ► చేశామంటూ ఆన్లైన్లో నమోదు చేస్తారు ► కాసులివ్వందే కాలు కదపరనే ఆరోపణలు ► సర్వే, భూ రికార్డుల శాఖ తీరిది..! డి.శకుంతలకు కణేకల్ మండలం ఉడేగోళం గ్రామం పొలం సర్వే నెంబరు 185-బి2లో ఐదు ఎకరాల భూమి ఉంది. తన భూమిని సర్వే చేయించుకునేందుకు 2015, జూన్ 6న మీ-సేవాలో (011500298958) దరఖాస్తు చేసుకుంటూ చలనా రూ.285 చెల్లించింది. ఏడాదవుతున్నా ఆ భూమిలో సర్వే చేయలేదు. మీ సేవా నెంబర్ ప్రకారం కంప్యూటర్లో పరిశీలిస్తే సర్వే పూర్తి చేసినట్లు (అప్రూవ్డ్) అప్లోడ్ అయ్యింది. అభ్యంతరాలు ఉంటే రిజెక్ట్ చేయాలి. అలా కాకుండా అప్రూవ్డ్ అని నమోదు చేశారు. అంటే ఇక్కడ సర్వే చేయకుండానే చేసినట్లుగా ఆన్లైన్లో నమోదు చేశారు. ఇలాంటివి ఈశాఖలో సర్వసాధారణమైపోయాయి. అనంతపురం అర్బన్: సర్వే, భూ రికార్డుల శాఖలో తిర‘కాసు’ వ్యవహారాలకు అదుపు లేకుండా పోతోంది. భూముల సర్వే చేయించుకునందుకు వచ్చేవారికి ఇక్కడి ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. మీ-సేవలో దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయరు... సరికదా చేసేసినట్లుగా అప్రూవ్డ్ అంటూ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇక్కడ కాసులివ్వందే ఏ ఫైలు కదపరనే ఆరోపణలున్నాయి. మామూలుగా అయితే సర్వే కోసం మీ-కోసంలో చలనా కట్టి దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా సమస్య పరిష్కరించాలి. అయితే ఇక్కడ ఏడాదైనా పనులు జరగవు. పైగా పూర్తి చేసినట్లుగా రికార్డుని చూపిస్తారు. ఇదంతా కాసులు దండుకునే ప్రయత్నంలో భాగమేననే విమర్శలు వినవస్తున్నాయి. మీ-సేవాలో చలానా కట్టిన తరువాత రసీదుని సంబంధిత సర్వేయర్ వద్దకు తీసుకెళ్లి ఆయన వెంటపడి ముడుపులు ముట్టజెబితే కాని పనిచేయరన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొందరు సర్వేయర్ల అక్రమార్జన నెలకు రూ.లక్షపైగానే ఉంటుందని ఆ శాఖలోకి కొందరు బహిరంగంగానే చెప్పుకుంటారు. వీరు ప్రతి రోజు రూ.5 వేలకు తక్కువ కాకుండా దండుకుంటారంటున్నారు. రెవెన్యూ శాఖలో భాగమైన సర్వే, భూ రికార్డుల శాఖను పక్షాళన చేయాల్సిన అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక కూడా మతలబుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులొస్తే చర్యలు సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా సర్వే చేయాల్సిందే. ఒకవేళ వారు చేయకపోతే ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. డి.శకంతలకు చెందిన భూమి సర్వే చేయకుండా అప్రూవ్డ్ అని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పు. పరిశీలించి చర్యలు తీసుకంటాం. సర్వే కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. - టి.శ్రీనివాసులు రెడ్డి, సహాయ సంచాలకులు