బాబుకు తెలిసే భూమాయ!
► తుపాన్ సమయంలో విశాఖలోనే సీఎం
► అప్పుడే భూరికార్డులు మాయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి రెండు ఉదంతాలను పరిశీలిస్తే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూసేకరణ చేయాలని సీఎం పేషీ నుంచి విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు సూచనలు అందగానే పాలకమండలి ఆమోదించి కార్యాచరణలోకి దిగింది. హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు వేలాది రికార్డులు గల్లంతయ్యాయని చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు, బినామీలు రికార్డులను తారుమారు చేశారనే వాదనలు ఉన్నాయి. హుద్‌హుద్ సహాయ పనుల పర్యవేక్షణ పేరిట సీఎం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్‌లో మకాం వేశారు. ఆ సమయంలో ఆయనకు తెలియకుండానే రికార్డులు గల్లంతు అయ్యాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
విశాఖలో 2,45,896 ఫీల్డ్ లెవల్ మెజర్‌మెంట్ బుక్స్ (ఎఫ్‌ఎంబీ)లు ఉండగా 16,735 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండాపోయాయి. 3022 రెవెన్యూ సర్వీస్ రికార్డ్ (ఆర్‌ఎస్‌ఆర్)లు ఉండగా అందులో 379 అదృశ్యం అయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 233 మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలా వరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. రాష్ట్ర లైబ్రరీలో 4551 రికార్డులు భద్రపర్చడంతో వాటిని వెనక్కు తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రికార్డులు ఎందుకుపోయాయనే దానికి వారిస్తున్న సమాధానాలు వింటే నివ్వెరపోవడం ఖాయం! హుద్‌హుద్ తుపానులో ఈ రికార్డులు పోయాయని కలెక్టర్ చెబుతున్నారు. 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను విశాఖ తీరాన్ని దాటింది.
ఈ ఘటనల్లో ఎక్కడా తహసీల్దార్ కార్యాలయాలు కూలిపోయినట్లు, కొట్టుకుపోయినట్టు, ధ్వంసమైనట్లు రికార్డు కాలేదు. పైగా తహసీల్దార్లు, ఆర్డీవోలు, రెవెన్యూ సిబ్బంది కార్యాలయాల్లోనే ఉండి తుపాను పరిస్థితిని సమీక్షించారని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. ఇక సీఎం కూడా ఆ çసమయంలో విశాఖలోనే మకాం వేశారు. ఇదే సమయంలో రికార్డులు పోయాయని చెబుతున్నారు. తుఫాను నష్టాలకు సంబంధించిన వివిధ అంశాల ప్రస్తావనలో కూడా ఏ అధికారి రికార్డులు పోయాయని అప్పుడు చెప్పలేదు. ‘సాక్షి’లో భూ కుంభకోణాలపై వరుసగా కథనాలు వచ్చిన తర్వాతే అధికారులు రికార్డులు పోయాయని ఇప్పుడు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. రికార్డులు మాయమైన విషయాన్ని రెÆండున్నరేళ్ల తర్వాత గుర్తించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల అవకతవకలకు సంబంధించి కీలక అంశాలు, ఆధారాలు వెలుగులోకి రాకుండా తమను తాము రక్షించుకునేందుకు కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయంటున్న భూరికార్డులివే
విశాఖ జిల్లా భీమిలి మండలంలో 4500 ఎకరాలు, పెందుర్తిలో 3500, అనకాపల్లిలో 6500, యలమంచిలిలో 4000, విశాఖ నగరంలో 300 ఎకరాల భూముల రికార్డులు కనిపించడం లేదంటూ అధికారులే ప్రకటించారు. రెవెన్యూ సర్వీసు రికార్డులకు తోడు ఎఫ్‌ఎంబీ, రెవెన్యూ విలేజ్ మ్యాప్, సెటిల్‌మెంట్ ఫేర్ అడంగల్స్ కూడా హుద్‌హుద్ తుపానులో గల్లంతయ్యాయని చెప్పుకొచ్చారు. జిల్లాలో 2789 గ్రామాలకు మాత్రమే విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి. 233 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ మ్యాప్స్ లేని పరిస్థితి. ఆర్‌ఎస్‌ఆర్, ఎస్‌ఎఫ్‌ఏ, సెట్‌వార్స్ 3022 ఉండాల్సి ఉండగా. కేవలం 2643 మాత్రమే ఉన్నాయి. 379 గ్రామాలకు సంబంధించిన రికార్డులు గల్లంతయ్యాయి.
రెవెన్యూ భూ రికార్డులను బట్టి జిల్లాలో ఎఫ్‌ఎంబీలు 2,45,896 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 2,29,161కి మాత్రమే ఉన్నాయి. 16,735 ఎఫ్‌ఎంబీలు గల్లంతయ్యాయి. ఈ ఎఫ్‌ఎంబీలలో 1,06,239.6 ఎకరాల భూమి ఉంది. విశాఖ అర్బన్, గ్రామీణ మండలాల్లోనే 1463.74 ఎకరాలకు చెందిన 78 ఎఫ్‌ఎంబీలు మాయమయ్యాయి. వీటితోపాటు సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగళ్లు (ఎస్‌ఎఫ్‌ఏ)లు కూడా లక్షల సంఖ్యలో గల్లంతయ్యాయి. విశాఖపట్నం డివిజన్‌లో 79,691, అనకాపల్లి డివిజన్‌లో 72,640, నర్సీపట్నం డివిజన్‌లో 5,633, పాడేరు డివిజన్‌లో 1,37,116 ఎస్‌ఎఫ్‌ఏలు కనిపించడంలేదు.