ఇంద్రకీలాద్రిపైకి దేవస్థానం బస్సులకే అనుమతి
హైదరాబాద్: విజయవాడలో ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు.. ఇంద్రకీలాద్రిపై నుంచి భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునే ఘాట్రోడ్డులో భక్తుల రాకపోకలను ఆలయ అధికారులు నిలిపివేశారు. కేవలం దేవస్థానం బస్సులను మాత్రమే ఘాట్రోడ్డులో ప్రయాణించేందుకు ఆలయ అధికారులు అనుమతించారు. కొండపైకి ద్విచక్రవాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే పడి ఉన్న కొండ చరియలను సిబ్బంది సహాయంతో ఆలయ అధికారులు ఘాట్ రోడ్డులో నుంచి తొలగిస్తున్నారు.