=రేపు భారీ బహిరంగ సభ
=హైదరాబాద్‌కు తరలివచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోని ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: స్టేడియం చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల్లో కేటాయించిన ప్రాంతాల మినహా మిగిలిన చోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనలు కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు.
జిల్లా నుంచి వచ్చే వాహనాలకు మార్గం, పార్కింగ్స్ ఇలా...
విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వ చ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, కా చిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆ ర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆ ర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
శంఖారావానికి సన్నద్ధం
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కేడర్ బయల్దేరుతున్నారు. నియోజక వర్గానికి 5 వేల మంది తరలి వెళ్లేలా పార్టీ వర్గాలు ఏర్పా ట్లు చేసినా తుపాను వల్ల రవాణా సదుపాయాల కల్పనలో కొంత ఆటంకం ఏర్పడుతోం ది. విశాఖ నుంచి రెండు ప్రత్యేక రైళ్ల కోసం పార్టీ నేతలు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులకు వినతి పత్రం పంపి డబ్బులు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ రైల్వే అధికారులు 22 బోగీలు కలిగిన ఒక ప్రత్యేక రైలు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించారు.
దీంతో నియోజక వర్గాల సమన్వయకర్తలు ప్రత్యేకంగా బస్సులు, కార్లు, ఇతర వాహనాలను ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లలో పడ్డారు. నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యవేక్షణలో నగర పార్టీ నేతలు, సమన్వయకర్తలు, రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పర్యవేక్షణలో నియోజక వర్గాల సమన్వయకర్తలు హైదరాబాద్ సభకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రత్యేక వాహనాలు రాజధానికి బయల్దేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సభ జరుగుతుందని, ఉద్యోగులు, ఇతర పార్టీల వారు, సమైక్యాంధ్ర కోరుకునే ప్రతి ఒక్కరు హాజరు కావాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో సమైక్య సభకు జిల్లా నుంచి కూడా ఎన్జీవోలు, అనేక కార్మిక, కర్షక సంఘాలు మద్దతు పలికాయి. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోరాదనే భావన ప్రజల్లో ఉండడంతో రాజకీయాలకు సంబంధం లేని జనం కూడా వాహనాలెక్కి సమైక్య సభకు తరలి వెళ్లనున్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైలు
సమైక్య శంఖారావం సభకు హాజరయ్యే వారి కోసం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని విశాఖ పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించి సమైక్యాంధ్ర సభ సమన్వయకర్త సత్తి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనకాపల్లిలో సాయంత్రం 5.40 గంటలకు, తునిలో సాయంత్రం 6.20 గంటలకు ఆగుతుందని, ప్రజలు, పార్టీ కేడర్ ఆయా నియోజక వర్గాలకు కేటాయించిన బోగీల్లోకి చేరుకోవాలన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. సమైక్య సభ తర్వాత శనివారం రాత్రి 9 గంటలకు ఇదే రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని ఆయన చెప్పారు.