జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మద్దిపాడు : లోడు లారీలో మంటలు చెలరేగి లక్షల రూపాయల విలువైన బట్టల బండిల్స్ తగలబడ్డాయి. ఈ ఘటన గుండ్లాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. వివరాలు.. కోల్‌కతా నుంచి తిరుచ్చి వెళ్తున్న బట్టలలోడు లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకాడు. గమనించిన స్థానికులు ఎస్సై మహేష్, ఒంగోలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి స్థానిక యువకులతో కలిసి కొన్ని బట్టల బండిల్స్‌ను బయటకు లాగి వేశారు.
దాదాపు మూడొంతుల బట్టలు లారీలోనే ఉండిపోయాయి. నైలాన్ బట్టలు కావటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. లారీలో కోటి రూపాయలకుపైగా విలువైన సరుకు ఉంటుందని అంచనా. ఎంత నష్టం జరిగిందో బట్టల యజమాని వస్తే కానీ తెలియదు. ఎస్సై మహేష్ తన సిబ్బందితో వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి.అప్పిరెడ్డి, ఒంగోలు ఫైర్ స్టేషన్ అధికారి సుబ్బారావులు మంటలు ఆర్పే పనులను పర్యవేక్షించారు.
సందట్లో సడేమియా
ఒక వైపు లారీ తగులబడుతుంటే దారిన వెళ్లేవారు సందట్లో సడేమియాలా వ్యవహరించారు. స్థానిక యువకులు కొందరు లారీ నుంచి బయటకు లాగిన బండిల్స్‌లోని మంచి బట్టలను ఏరుకుని వెంట తీసుకెళ్లారు. గుండ్లాపల్లి సర్పంచ్ అప్రమత్తమై స్థానిక యువకుల సహకారంతో బండిల్స్‌ను ఒక చోటుకు చేర్చి జాగ్రత్త పరిచారు.