రోజూ ఒకటే ‘ఆట’
క్రేజీ పోయి... లేజీ ఆవహించింది. వెలుగు జిలుగులు లయ తప్పి ఆస్వాదనం ఆవిరి అవుతోంది. పాడిందే పాట... అన్నట్టుగా ఏడేళ్లుగా ఒకటే పాట... ఒకటే ఆట... ఒకటే బోరు. కోట్లాది రూపాయలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప... వచ్చినవారిని ఆకట్టుకోలేకపోతోంది లుంబినీ పార్కులోని లేజర్ షో. పర్యాటకుల ఉత్సాహాన్నంతా ఒకే దెబ్బకు ఎగరేసుకుపోతోంది.
రోజూ ఒకటే ‘ఆట’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) పర్యవేక్షణలో ప్రస్తుతం లుంబినీ పార్కు నిర్వహణ సాగుతోంది. ఆదాయంపై దృష్టి సారించడం మినహా అదనపు హంగులు సమకూర్చేందుకు హెచ్‌ఎండీఏ ఎలాంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. వినోదం కోసం వచ్చేవారికి వైవిధ్యం లేక విసిగెత్తిపోతున్నా... చార్జీల మోత మాత్రం మోగిస్తూనే ఉంది.
ఆరంభంలో రూ.30 ప్రవేశ రుసుముతో ప్రారంభమైన లేజర్ షోకు... ప్రస్తుతం రూ.50 వసూలు చేస్తున్నారు. అయితే అందుకు తగ్గ వినోదాన్ని మాత్రం పర్యాటకులకు అందించలేకపోతున్నారు. మూస ధోరణితో ప్రదర్శిస్తున్న షోతో ప్రేక్షకులు బోరెత్తిపోతున్నారు. లేజర్ షో వల్ల ఏడాదికి కోటిన్నర రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా... విభిన్నంగా, కొత్తగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్న ధ్యాస కూడా హెచ్‌ఎండీఏకు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
టెండర్ ఎందుకు రద్దైంది?
పర్యాటకులను ఆకట్టుకొనే లేజర్ షోకు కొత్త అందాలు అద్దేందుకు అధికారులు చేసిన ప్రయత్నానికి స్వయంగా హెచ్‌ఎండీఏ కమిషనర్ మోకాలడ్డటం విస్మయం కల్గిస్తోంది. జీవవైవిధ్య సదస్సు (కాప్-11) సందర్భంగా లేజర్ షోకు మరిన్ని హంగులద్దేందుకు రూ.1.65 కోట్లు నిధులు కేటాయించారు. ప్రస్తుతమున్న థీమ్‌కు కొత్త థీమ్‌ను జత చే సేందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి, వైభవాలు, హైదరాబాద్ చారిత్రక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించేలా సరికొత్త థీమ్‌లతో లేజర్ షోను పరిపుష్ఠం చేయాలని భావించారు. ఆమేరకు టెండర్‌ను కూడా ఆహ్వానించగా... రెండు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి.
అయితే.. సాంకేతికంగా మంచి ఎక్విప్‌మెంట్‌ను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసేందుకు ఎవరు ముందుకు వస్తే ... వారికి ఈ టెండర్‌ను అప్పగించాలని కమిషనర్ అంతర్గతంగా సిబ్బందికి సూచించారు. దీంతో వ్యవహారం టెక్నికల్ బిడ్స్ వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత దీనిగురించి పట్టించుకొన్న నాథుడే లేడు. ప్రస్తుతం పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. ఈ దశలో మళ్లీ టెండర్ పిలిచేందుకు ఎన్నికల కోడ్‌ను బూచిగా చూపుతూ అధికారులు లేజర్ షో నవీకరణనను గాలికి వదిలేశారు.