అమర వీరుల స్తూపం నిర్మాణం కోసం తీసుకున్న పార్కింగ్ స్థలం ఇదే..
సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కులోని లేజర్ షో మసకబారుతోంది. మొత్తం ఐదెకరాల్లో పార్కు, లేజర్ షో ప్రాంతం, పార్కింగ్ ప్రదేశం ఉన్నాయి. అయితే ఇందులోని ఎకరం స్థలాన్ని ఇటీవల ఆర్‌అండ్‌బీ శాఖ తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ నుంచి తీసుకుని పనులు చేపట్టింది. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి తలెత్తింది. దీనివల్ల లేజర్‌షోకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. బస్సులు, కార్ల పార్కింగ్‌కు చోటులేక దేశ, విదేశీ అతిథులు తమ సందర్శన జాబితాలో లుంబినీపార్కు, లేజర్ షో లేకుండానే పర్యటనను ముగించుకుంటున్నారు. ప్రస్తుతం కార్లు, బస్సులు నిలిపే స్థలాన్ని ఆర్ అండ్‌బీ స్వాధీనం చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాన్ని కూడా తీసుకోనున్నారు. అదే జరిగితే.. ఇక్కడకు వచ్చే పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పూర్తిస్థాయిలో పడిపోవచ్చని పార్కు నిర్వాహకులు చెబుతున్నారు.
తగ్గిపోయిన సందర్శకులు
వీకెండ్‌లో సందర్శులు కుటుంబ సభ్యులతో ఎంచక్కా వాహనాల్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసేవారు. తర్వాత లుంబినీపార్కు చుట్టేయడంతో పాటు సాగర్ తీరాన బోటులో షికారు చేసి సాయంత్రం లేజర్ షో చూసి తిరిగి వెళ్లేవారు. ఆగస్టు తొలి రెండు వారాల్లో లుంబినీ పార్కుకు సందర్శకుల సంఖ్య రోజుకు సగటున 5 వేలు ఉంటే.. చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 3,750 వరకు తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పూర్తిగా పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని, పార్కింగ్‌కు స్థలం ఇవ్వకపోతే లుంబినీపార్కు, లేజర్ షో విశిష్టత మసకబారడం ఖాయమని అధికారులు అంటున్నారు.
లేజర్ షోకు ‘నష్ట’కాలమే..
లుంబినీ పార్కుకు వచ్చే పర్యాటకుల్లో సీజన్ సమయాల్లో లేజర్ షోకు 1500 నుంచి 1800 మంది వరకు వీక్షకులు ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం (ఆన్‌సీజన్)లో ఆ సంఖ్య వెయ్యి మందికి పడిపోయింది. ఆగస్టు తొలి రెండు వారాల్లో 800కు పైగానే వీక్షించినా చివరి రెండు వారాల్లో ఆ సంఖ్య 400కు తగ్గిపోయింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం కూడా పోతే లుంబినీ పార్కు, లేజర్ షో ఆదాయంపై ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. లుంబినీ పార్కు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10గా వసూలు చేస్తున్న అధికారులు లేజర్ షోకు రూ.50 తీసుకుంటున్నారు. పార్కుకు రాకుండా నేరుగా లేజర్‌షోకు వెళ్లేవారికి భద్రతా సిబ్బంది రూ.50 ఛార్జి తీసుకుంటున్నారు. ఈ రకంగా చూసుకుంటే అటు పార్కుకు వచ్చే ఆదాయం, ఇటు లేజర్ షోకు వచ్చే ఆదాయం కేవలం వాహనాలకు పార్కింగ్ లేకపోవడం వల్ల దాదాపు 25 శాతం పడిపోయిందని చెబుతున్నారు. పార్కింగ్‌కు ప్రత్యామ్నాయం చూపెడితే తప్ప ఆదాయం పెరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు.
పార్కింగ్‌పై తర్జనభర్జన..
లుంబినీ పార్కులో ప్రస్తుతం పార్కింగ్ కాంట్రాక్ట్ బాధ్యతలు చూసుకుంటున్న సంస్థను తప్పుకోవాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఎన్టీఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్కింగ్‌కు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ పరిమిత కాలాన్ని బట్టి సమకూర్చాలని ఆలోనచలో అధికారులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు తొలిరెండు అంతస్తుల్లో లుంబినీపార్కు, లేజర్ షోకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు చోటిస్తామని చెబుతున్నారు. అయితే ఆ నిర్మాణం పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆలోపు వాహనాల పార్కింగ్ సమస్య ఏంటనేదాని పైనే అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీనిపై హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చొరవ చూపి ఏదో ఒక మార్గాన్ని చూపాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment