నకిలీ కరెన్సీ కేసులో అల్కాజ్‌కు ఐదేళ్ల జైలు
- మరో ముగ్గురు నిందితులకు సైతం విధింపు
- తీర్పు వెలువరించిన నాంపల్లి న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2007 ఆగస్టు 25న అరెస్టు చేసిన అంతర్జాతీయ నకిలీ కరెన్సీ రాకెట్ ప్రధాన సూత్రధారి, దుబాయ్ వాసి ఖమీస్ అలీ అల్కాజ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు గురువారం తీర్పునిచ్చిం ది. ఇతడితో పాటు మరో ముగ్గురికీ జైలు శిక్షను ఖరారు చేసింది. వీరిలో ఇద్దరికి నాలుగేళ్లు, ఒకరికి ఏడాది శిక్షను విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇంకో ముగ్గురిపై నేరం నిరూపణకాలేదని పేర్కొంది.
2007లో నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో జంట పేలు ళ్లు జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా పాతబస్తీలోని బార్కస్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో రూ.2.36 కోట్ల నకిలీ కరెన్సీని పట్టుబడింది. జంట పేలుళ్లు జరిగిన రోజే నిందితుల అరెస్టు ప్రకటించారు. ఈ కేసులో దుబాయ్‌కు చెందిన ఖమీస్ ఒబేద్ అలియాస్ ఖమీస్ అలీ అల్కాజ్ ప్రధాన నిందితుడిగా ఉండగా... హైదరాబాద్‌కు చెందిన ఖాలిద్ బిన్ సాలెహ్, మహ్మద్ నజాత్, ఖాలిద్ అబ్దుల్లా నజాత్‌తో పాటు మరో ముగ్గురు నింది తులుగా ఉన్నారు.
మొత్తం నిందితుల్లో పాక్ జాతీయులైన ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఖాలిద్ నగరంలో వెస్ట్ ఇండియా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ పేరులో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. దుబాయ్‌కు చెందిన ఖమీస్ అలీ అల్కాజ్ ద్వారా పాకిస్తాన్‌లో ముద్రితమైన రూ.500, రూ.1000 డినామినేషన్‌లో ఉన్న నకిలీ కరెన్సీని హైదరాబాద్‌కు చేరుకుంది. 2007 ఏప్రిల్ నుంచి మూడు దఫాలుగా చిత్తుకాగితాల పేరుతో సీ కార్గో ద్వారా ముంబై మీదుగా ఇక్కడకు తీసుకువచ్చారు.
దుబాయ్ వాసి ఖమీస్ పాస్‌పోర్ట్ ఆధారంగా అతను మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించినట్లూ పోలీ సులు గుర్తించారు. నకిలీ కరె న్సీ భారత్ చేరుకున్న సమ యం, ఖమీస్ పాక్ సందర్శించిన సమయం ఒకటే కావడంతో పాక్ నుంచి ఇతనే తీసుకువచ్చినట్టు నిర్థారించారు. ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు దర్యాప్తు చేసి అభియోగాలు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాల బుచ్చయ్య వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం గురువారం అల్కాజ్ ఖమీస్‌కు ఐదేళ్లు, ఖాలిద్ బిన్ సాలెహ్, మహ్మద్ నజాత్‌లకు నాలుగేళ్లు, ఖాలిద్ అబ్దుల్లా నజాత్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది.
2007 నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్కాజ్ ఖమీస్‌కు దాదాపు 20 నెలల అనంతరం బెయిల్ మంజూరైంది. అయితే ఇతనిపై గుజరాత్‌లోనూ ఓ కేసు నమోదై ఉండటంతో అది వీగిపోయే వరకు జైల్లోనే ఉన్నాడు. 2009 ఏప్రిల్‌లో ఆ కేసు వీగిపోవడంతో ఖమీస్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు.
ఖమీస్ జైల్లో ఉంటూనే తన అనుచరుల ద్వారా కరెన్సీ రాకెట్ నడిపాడని గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఇతడిపై నిఘా ఉంచారు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఖమీస్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద రూ.2 లక్షల నకిలీ కరెన్సీ లభించడంతో మళ్లీ అరెస్టు చేశారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది.