సాక్షి, హైదరాబాద్: అతడి పేరు కస్తూరి రమేష్ బాబు... ఆమె పేరు రామేశ్వరి. అన్నాచెల్లెళ్లు అయిన వీళ్లు యూట్యూబ్ వీడియోల ఆధారంగా నకిలీ కరెన్సీ ముద్రణ, చెలామణిలో దిట్టలు. ఐదు నెలల కాలంలో గోపాలపురం, గుజరాత్‌ల్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రమేష్ గుజరాత్ జైల్లో ఉండగా... రామేశ్వరి తన అన్న ద్వారా పరిచయమైన హసన్ బిన్ హమూద్‌తో కలిసి ఫేక్ నోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించింది. వీరిద్దరినీ పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.27 లక్షలు నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారని డీసీపీ క్రైమ్స్ డాక్టర్ పి.శబరీష్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
అన్న ఆలోచన.. చెల్లెలి తయారీ...
నారాయణపేట్ జిల్లా కోస్గికి చెందిన రమేష్ తన సోదరి రామేశ్వరితో కలిసి బండ్లగూడ జాగీర్‌లోని కాళీ మందిర్ వద్ద కొన్నాళ్లు నివసించాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రమేష్ నకిలీ నోట్లు ముద్రించి చెలామణి చేయాలని నిర్ణయించుకున్నాడు. రామేశ్వరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో ల్యాప్‌టాప్, స్కానర్, ప్రింటర్ సాయంతో 2021 నుంచి ఫేక్ కరెన్సీ తయారీ దందా మొదలెట్టారు. యూట్యూబ్‌లో ఉన్న అనేక వీడియోలు చూసిన వీళ్లిద్దరూ నోట్లు తయారు చేయడంతో పాటు ఆ వీడియోల కింద కామెంట్ బాక్స్‌లో ‘మాల్ హై హోనా క్యా?’ అంటూ రమేష్ కామెంట్ చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
మొదటిసారిగా గోపాలపురంలో అరెస్టు..
నాచారంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే సాట్ల అంజయ్య తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకు చికిత్స చేయించడానికి డబ్బు కోసం ఇతడు ఆ వీడియోలు చూశాడు. అలా రమేష్‌ను సంప్రదించి రూ.50 వేలు చెల్లించి రూ.1.3 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నాడు. వీటిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద చెలామని చేస్తూ అంజయ్య పోలీసులకు చిక్కాడు. ఇదే కేసులో రమేష్‌ను గతేడాది సెపె్టంబర్‌లో గోపాలపురం పోలీసులు అరెస్టు చేయగా.. రామేశ్వరి కోర్టు నుంచి బెయిల్ పొందారు.
జైల్లో రమేష్‌కు హత్య కేసులో అరెస్టు అయిన ఫలక్‌నుమకు చెందిన ఆటోడ్రైవర్ హసన్‌తో పరిచయమైంది. అక్కడే వీళ్లు నకిలీ కరెన్సీ చెలామణిపై ఓ పథకం వేశారు. ఈ కేసులో బయటకు వచ్చిన రమేష్... రామేశ్వరితో కలిసి తాండూర్‌కు మకాం మార్చాడు. భారీగా నకిలీ కరెన్సీ ముద్రించిన వీళ్లు ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లో మారి్పడికి ప్రయతి్నంచారు. అక్కడి ముఠా వీరి నుంచి తీసుకున్న నోట్లను చెలామణికి ప్రయతి్నంచి చిక్కింది. వీరి ద్వారా రమేష్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజ్‌కోట్ పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
పాతబస్తీలో దాచి మార్పిడికి యత్నం..
రమేష్ ద్వారానే రామేశ్వరికి హసన్ విషయం తెలిసింది. గుజరాత్ పోలీసులు దాడి చేసినప్పుడు మరో గదిలో దాచి ఉంచిన రూ.27 లక్షలు వారికి దొరకలేదు. ఈ మొత్తాన్ని హసన్ వద్దకు తీసుకువచ్చి దాచిన రామేశ్వరి ఇద్దరూ కలిసి మార్పిడి చేయాలని భావించారు. వీరిద్దరూ ఈ ప్రయత్నాల్లో ఉన్నారనే సమాచారం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రకు తెలిసింది.
ఆయన నేతృత్వం ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, షేక్ బుర్హాన్, కె.నర్సింహులు వలపన్ని ఇద్దరినీ పట్టుకుని నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ను గుజరాత్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. వీళ్లు ఇప్పటి వరకు దాదాపు రూ.కోటి విలువైన నకిలీ నోట్లు మార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. గోపాలపురం పోలీసులు రమేష్‌ను పట్టుకున్నప్పుడు అతడి ల్యాప్‌టాప్‌లో రూ.2 వేలతో పాటు రూ.5 వేల నోటు స్కాన్డ్ కాపీని గుర్తించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆర్బీఐ వీటిని ముద్రిస్తుంటుంది.
చదవండి వివాహేతర సంబంధం: రాత్రి వేర్వేరు గదుల్లో నిద్రిస్తుండగా
Comments
Please login to add a commentAdd a comment