ఇప్పటివరకు ఓటు హక్కు పొందనివారు.. తాజా జాబితాల్లో చోటు దక్కనివారికి సదవకాశం. రాబోయే ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించు కునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంకెందుకాలస్యం.. రేపటి ఓటు నమోదుకు సిద్ధం కండి!
ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే లాస్ట్ చాన్స్ అంటూ యువతను జిల్లా యంత్రాంగం సమాయత్తం చేస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని మిగిలిపోయిన వారంతా సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏకకాలంలో 3,521 పోలింగ్ కేంద్రాల్లో...
ఈ నెల ఐదున కేంద్ర ఎన్నికల సంఘం 16వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంకా ఓట్లు నమోదుకాని వారు ఉన్నారన్న సంగతిని గుర్తించింది. దీంతో దేశ వ్యాపితంగా కొత్త ఓట్ల నమోదు, మార్పులకు ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్ చివరి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు కొత్త ఓట్ల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 3,521 పోలింగ్ కేంద్రాల్లోను ఏకకాలంలో ఓట్ల నమోదు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు చేసుకోవచ్చు.
వరుస ఎన్నికల్లో ఐదు ఓట్లు...
జిల్లాలో 2014 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా గత ఏడాది చివరిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో 69 వేలకు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారికి కొత్త జాబితాలో చోటు దక్కడంతో వరుస ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది. ఒకేసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సైతం వచ్చే అవకాశం ఉండటంతో ఓటు హక్కు పొందేలా యువత ఈ నెల తొమ్మిదిన అవకాశం ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఓటు నమోదు ఇలా..
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న 2014 సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు లేనివారు ఈ నెల తొమ్మిదిన దరఖాస్తు చేసుకోవచ్చు.