జిల్లాలో రబీ సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. తొలకరి వర్షాలు తప్ప సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడం.. రబీ సీజన్ దగ్గర పడుతుండడం తో వ్యవసాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు రైతాం గంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండు కుండగా మారింది. ఇకపై వచ్చే వరద నీటిని వివిధ మార్గాల ద్వారా జిల్లాలోని నీటి ప్రాజెక్టులకు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న వరద నీటితో మంగళవారం నాటికి సోమశిలలో 15 టీఎంసీలకు నీటి లభ్యత చేరనుంది.
సాక్షి, నెల్లూరు : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి మరింతగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతుండటంతో సింహపురి రైతులలో ఆశలు చిగురించాయి. గత మంగళవారం కర్నూలు జిల్లా వెలుగోడు ప్రాజెక్టు నుంచి సోమశిలకు కృష్ణానీటిని అధికారులు విడుదల చేశారు. మంగళవారం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 15 టీఎంసీలకు చేరనుంది. రోజూ 12 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో జిల్లా రైతాంగంలో ఖరీఫ్ సాగుపై ఆశలు చిగురిస్తున్నా యి.
ఇదే వరద పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే సోమశిల కృష్ణా నీటితో నిండే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా వెలుగోడు నుంచి గాలేరు, కుందు, పెన్నా మీదుగా సోమశిలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇవి కాక మరో 70 టీఎంసీల నీరు వస్తే 20 టీఎంసీలు కండలేరులో నిలువపెట్టి మిగిలిన 50 టీఎంసీల నీరు సోమశిలలో నింపే అవకాశం ఉంది.
గతేడాది సైతం సోమశిలలో 60 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసిన విషయం విదితమే. ఇదే జరిగితే జిల్లాలో ఖరీఫ్ పూర్తిస్థాయి ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశముంది. దీంతో అన్నదాతల్లో ఒకింత హర్షం వ్యక్తమవుతోంది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే ఈ నెలాఖరులోపే సోమశిల నిండే అవకాశముంది. ఒక టీఎంసీ నీటితో దాదాపు 12 వేల ఎకరాల్లో వరిసాగు చేయవచ్చు. ఈ లెక్కన అధికారికంగా దాదాపు 8 లక్షల ఎకరాలు.. అనధి కారికంగా 10 లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశముంటుంది.
జిల్లాలో మొత్తం 10,70,165
ఎకరాల సాగు ఏరియా
మేజర్ ఇరిగేషన్ కింద సోమశిల కెనాల్స్ పరిధిలో ఎన్‌ఎఫ్‌సీ, ఎన్‌ఎఫ్‌సీ కొనసాగింపు కాలువ , ఎస్‌ఎఫ్ కాలువ, కావలి కాలువల పరిధిలో మొత్తం 2,57,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక పెన్నార్ డెల్టాలో దువ్వూరు, పైడేరు, ఈస్ట్రన్, సదరన్, ఎన్‌టీఎస్, జాఫర్‌సాహెబ్, కృష్ణపట్నం, వల్లూరు, సర్వేపల్లి కాలువలతో పాటు ట్యాంక్‌బెడ్ ఆయకట్టు మొత్తం కలిపి 2,47,700 ఎకరాలు ఉంది. కండలేరు పరిధిలో తెలుగుగంగ కింద 2,22,712 ఎకరాలు మొత్తం 7,27,212 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాక మీడియం ఇరిగేషన్ ద్వారా గండిపాళెం ప్రాజెక్టు, కనుపూరు కాలువ, స్వర్ణముఖి బ్యారేజీ పరిధిలో 43,965 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక మైనర్ ఇరిగేషన్ కింద ఉన్న చెరువులు 742, పంచాయతీరాజ్ పరిధిలోని 984 చెరువులు కలిపి 1,826 చెరువుల పరిధిలో 2,98,988 ఎకరాల ఆయకట్టు ఉంది. సోమశిలకు 70 టీఎంసీల కృష్ణా జలాలు చేరితే మొత్తం 10,70,165 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశముంది.
ఈ ఏడాది సైతం స్థానికంగా వర్షాలు కురవకపోవడంతో పాటు పెన్నా పరీవాహక ప్రాంతమైన అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో సైతం పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో అన్నదాతలు కృష్ణా నీళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం అయిన 215 టీఎంసీలకు చేరింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం నిండటంతో తక్షణం పోతిరెడ్డిపాడు ద్వారా దిగువకు నీటిని వదలి 68 టీఎంసీల కండలేరును, 78 టీఎంసీల సోమశిల ప్రాజెక్టులను నీటితో నింపాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకోసం జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. కృష్ణా నీళ్లు సోమశిలకు వచ్చి చేరి, రైతులు సాగుకు సన్నద్ధమయ్యే పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయాధికారులు జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వరి విత్తనాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా బీపీటీ 5204 రకం సాగుకు సంబంధించి సెప్టెంబర్‌లో వరినార్లు పోయాల్సి ఉంది. దీంతో నార్లు పోసేం దుకు రైతులు సన్నద్ధం కావడంతో వ్యవసాయాధికారులు విత్తనాలను సిద్ధం చేశారు.
సాగుపై ఆశ
Published Tue, Sep 2 2014 2:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement