సాగర్, శ్రీశైలంలో కనీస మట్టాల దిగువకు వెళ్లడంపై ఏపీ
ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందంటూ డ్రాఫ్ట్ నోట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్, శ్రీశైలంలో నిర్ణయించిన కనీస మట్టాలకన్నా దిగువకు వెళ్లేందుకు అనుమతించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడేలా ఉంది. రెండు ప్రాజెక్టుల పరిధిలో నిర్ణయించిన నీటి మట్టాల్లో ప్రస్తుతం ఉన్న నీరంతా తమకే దక్కుతుందంటున్న ఏపీ.. ఆ వినియోగం పూర్తయ్యాకే మరింత దిగువకు వెళ్లే అంశంపై చర్చిద్దామనే ధోరణి ప్రదర్శిస్తోంది.
ఈ విషయమై కృష్ణాబోర్డుకు లేఖ రాసేందుకు ఏపీ జల వనరుల శాఖ అధికారులు డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేశారని.. నేడో, రేపో పంపించే అవకా శం ఉందని బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి శ్రీశైలంలో 785, సాగర్‌లో 503 అడు గుల కనీస మట్టాల వరకు నీరు తీసుకోవాలని తొలుత నిర్ణయం జరిగింది. ప్రస్తుతం ఆ నీటిమట్టాల వద్ద 17 టీఎంసీల మేర నీరుంది.
ఆ నీరంతా తమకే దక్కుతుందని ఏపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తమ కోటా పూర్తయినందున ప్రస్తుత ఎండకాలంలో జంట నగరాలు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల అవసరం ఉంటుందంటూ వారం కింద బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు సాగర్‌లో 500, శ్రీశైలంలో 765 అడుగుల దిగువకు వెళ్లి నీరు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరగా, ఆ రాష్ట్ర అధికారులు డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసి అధికారుల పరిశీలనకు పంపారు.
ముందు మా వాటా విడుదల చేయాలి
తమకు ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందని, తొలుత సాగర్ నుంచి తమ వాటా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డ్రాఫ్ట్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాగర్‌లో 507 అడుగుల వద్ద నీటి మట్టాలున్నాయని, అందులో మొదటగా నిర్ణయించిన మేరకు 503 అడుగుల వరకు తమకు విడుదల చేయాలని ఏపీ స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. తమ వాటా వినియోగం పూర్తయిన తర్వాతే మరింత దిగువకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకుం టామని నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. బోర్డుకు మంగళవారమే అభిప్రాయం తెలపాల్సి ఉన్నా అధికారుల ఆమోదం తీసుకున్నాక పంపాలన్న నిర్ణయంతో వాయిదా వేశారు. డ్రాఫ్ట్‌ను బుధ లేక గురు వారం బోర్డుకు పంపే అవకాశముందని ఏపీ అధికార వర్గాల ద్వారా తెలిసింది.
మా వాటా పూర్తయ్యాక చూద్దాం..
Published Wed, Apr 12 2017 12:40 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement