ఆధార్ అనుసంధానం నత్తతో పోటీ
- విద్యాశాఖలో జిల్లాకు చివరి స్థానం
- నెల రోజులకు 51 శాతం మాత్రమే
- నిర్లక్ష్యం వహించిన 29 మంది ఎంఈఓలు షోకాజ్ నోటీసులు
కర్నూలు(విద్య): ఆధార్ అనుసంధానంలో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్య ఫలితంగా రాష్ర్టంలో జిల్లాకు చివరి స్థానం దక్కింది. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ అవసరమని పదేపదే చెబుతున్నా వాటిని అనుసంధానం చేయడంలో తాత్సారం చేయడంతో ఇప్పటి వరకు 51శాతం మాత్రమే పూర్తయింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి విద్యార్థుల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఆధార్ నంబర్‌తో నమోదు చేయాలి. ఇందుకోసం విద్యాశాఖ ఈనెల 20వ తేదీలోపు 100 శాతం ఆధార్ సీడింగ్ చేయాలని నిర్ణయించింది. కానీ 51శాతం మాత్రమే పూర్తయింది.
దీంతో తక్కువ శాతం సీడింగ్ చేసిన 29 మంది ఎంఈఓలకు శనివారం కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌ఏ పీఓ మురళీధర్‌రావు షోకాజ్ నోటీసులిచ్చారు. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 5,05,028 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 2,58,569 మంది విద్యార్థుల వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో ఆధార్ సీడింగ్ చేశారు. ఇంకా 2,46,459 మంది వివరాలు అనుసంధానం చేయాల్సి ఉంది.
ప్రైవేటు పాఠశాలల ముందంజ
ఆధార్ సీడింగ్ అంశంలో ప్రైవేటు పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో 3,99,157 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 2,06,387 మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 22,980 మందికి గాను 9,558 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 82,891 మందికి గాను 42,624 మంది ఆధార్ సీడింగ్ పూర్తి అయింది. మొత్తంగా 51 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగింది.
100 శాతం పూర్తి చేసేందుకు ఎంఈఓలు, సీఆర్‌పీ, ఎంఎస్ కోఆర్డినేటర్లు రెండు రోజుల్లో మిగిలిన 49 శాతం అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. నెల రోజులకు పైగా 51 శాతం మాత్రమే ఆధార్ సీడింగ్ చేసిన హెచ్‌ఎం. ఎంఈఓలు రెండు రోజుల్లో ఏ మేరకు చేస్తారో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు కలిగే ప్రయోజనాలకు అర్హత పొందాలంటే విద్యార్థుల వివరాలతో ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి.