సాక్షి ప్రతినిధి, కడప: ‘మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి. ఎంపీడీఓ బదిలీల్లో కర్రపెత్తనం కోసం తాపత్రయ పడుతున్నారు. జెడ్పీ పాలకమండలి చేపట్టిన బదిలీలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వంచే ఉత్తర్వులు ఇప్పించారు. అందుకు జిల్లా కలెక్టర్‌ను పావుగా వాడుకున్నారు. వెరసి జిల్లాలో 26 మంది ఎంపీడీఓల బదిలీలు నిలిచిపోయాయి.
జిల్లా పరిషత్ పాలకమండలిని కోల్పోయినా, కర్రపెత్తనం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు పడుతున్న తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. జెడ్పీ పాలకపక్షం పారదర్శకంగా చేపట్టిన ఎంపీడీఓల బదిలీలపై అధికారపార్టీ నేతలు కన్నెర్ర చేశారు. మండలాల్లో పైచేయి సాధించాలనే ఉద్దేశంతో జెడ్పీ సీఈఓ ద్వారా పైరవీలు తీవ్రతరం చేశారు.
సాధ్యమైనంత వరకూ అధికారపార్టీ పెత్తనానికి అనుగుణంగా నిర్ణయాలున్నప్పటికీ, ఒకరిద్దరు ఎంపీడీఓల బదిలీల్లో ప్రతిష్టకు పోయి ఏకంగా పంచాయతీరాజ్ కమిషనర్‌చే బదిలీలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిప్పించారు.
తెరవెనుక చక్రం తిప్పిన మేడా....
‘నేను ప్రభుత్వ విప్‌ను.. నేను చెప్పినట్లు ఎంపీడీఓల బదిలీలు చేయరా.. ఎలా కొనసాగిస్తారో చూస్తాను’. అంటూ పలుమార్లు సీఈఓ మాల్యాద్రిపై రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన సిఫార్సు మేరకే రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట మినహా మిగిలిన మండలాల్లో ఎంపీడీఓలను నియమించినట్లు తెలుస్తోంది.
అయితే సిద్ధవటం ఎంపీడీఓగా విజయకుమారి నియామకం వివాదాస్పదమైనట్లు తెలుస్తోంది. మేడా సిఫార్సు లెటర్ ఆధారంగా కడపలో నివాసం ఉంటున్న ఆయన సన్నిహితుడు పట్టుపట్టడంతో ఆమెను అక్కడ నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అరుుతే స్థానిక మండల తెలుగుదేశం నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్న ఆయన మొత్తం బదిలీల నియామకాలపైనే ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే మేడాకు రాయచోటి నియోజకవర్గంలోని ఇరువురు జెడ్పీటీసీలు తోడయ్యారు. మిమ్మల్ని నమ్మి వెంట వచ్చినందుకు ఒక ఎంపీడీఓను మార్పించలేరా? అంటూ తెలుగుదేశం పార్టీ నేతల్ని నిలదీసినట్లు తెలుస్తోంది. దాంతో మొత్తం వ్యవహారానికి చెక్ పెట్టాలనే దిశగా అధికారపార్టీ నేతలు పథక రచన చేసి సఫలీకృతులయ్యారు.
కలెక్టర్ నివేదిక ఆధారంగా.....
జిల్లా పరిషత్ పాలకమండలి నిర్వహించిన ఎంపీడీఓల బదిలీల్లో అక్రమాలు (మనీ అండ్ మెటీరియల్) చోటు చేసుకున్నాయని, ఇష్టారాజ్యంగా ప్రక్రియ చేపట్టారని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్‌కు జిల్లా కలెక్టర్ కేవీ రమణ నివేదిక సమర్పించారు. అంతేకాకుండా ఐదుగురు ఎంపీడీఓలను సొంత డివిజన్‌లో నియమించారని తెలిపారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో నిర్వహించిన ఎంపీడీఓల బదిలీలను నిలుపుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు.
ఆ మేరకు బదిలీ అయిన ప్రాంతంలో జాయిన్ కారాదంటూ సోమవారం వేకువజాము నుంచే రెవెన్యూ యంత్రాంగం ద్వారా ఎంపీడీఓల సెల్‌కు మెసేజ్‌లు, డీఆర్వో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి. బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం నిలిపివేసిందని, కొత్త పోస్టింగ్‌ల్లో చేరవద్దంటూ ఆదేశాలిచ్చారు.
జెడ్పీ చరిత్రలో తొలిసారి....
జిల్లా పరిషత్‌లో పాలన మొత్తం పాలకమండలి నేత ృత్వంలోనే నిర్వహించాలి. ఇప్పటి వరకూ జిల్లా పరిషత్ పరిధిలోని బదిలీలను ఛెర్మైన్ నేత ృత్వంలోనే చేపట్టారు. తొట్టతొలిసారి జెడ్పీ ఛెర్మైన్ నేత ృత్వలో నిర్వహించిన బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి సైతం నిబంధనలకు అనుగుణంగా, పొరుగు జిల్లాల పాలకమండలి పాటించిన విధివిధానాలను అనుసరించి బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. అయితే విపక్షపార్టీ పాలక మండలిలో ఉండటమే అధికారపార్టీ నేతలకు కంటగింపుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెపైచ్చు జిల్లా ప్రథమ పౌరుడిననే విషయం కూడా పట్టించుకోకుండా తనను అవమానిస్తున్నారని స్వయంగా జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి మీడియాకు వెల్లడించడం విశేషం. ఇప్పటికైనా పాలకులు ప్రజాస్వామ్యానికి విలువనివ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
బదిలీలపై అధికారపార్టీ కర్రపెత్తనం!
Published Tue, Nov 25 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement