సమైక్యాంధ్ర కోసం గళమెత్తిన నారీలోకం | Laugh for the galamettina narilokam | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర కోసం గళమెత్తిన నారీలోకం

Published Sun, Sep 15 2013 6:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Laugh for the galamettina narilokam

 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ పథంలో మహిళా లోకం రణభేరి మోగించింది. ఎక్కడికక్కడ భారీ ప్రదర్శనలు, మానవహారాలతో హోరెత్తించారు. గృహిణులతో పాటు, విద్యార్థులు, ఉద్యోగులు, ఐసీడీఎస్ కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరూ సమైక్య పతాక చేతబూని నిరసన గళమెత్తారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో మహిళలదే ప్రధాన పాత్ర కావడం గమనార్హం. వీరికి తోడుగా న్యాయవాదులు, కార్మికులు, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమించడంతో 46వ రోజూ జిల్లాలో ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి.
 
 నగరంలో భారీ ర్యాలీ:


 ఒంగోలు నగరంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ మహిళలు కదం తొక్కారు. దాదాపు 2 వేల మందికి పైనే మహిళలు ప్రకాశం భవన్ నుంచి లాయరుపేట సాయిబాబా గుడి వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వరకు  భారీ ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె ముగింపు సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చర్చిసెంటర్‌లో మానవహారం చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచ కపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు వెళ్తామంటూ హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ‘సోనియాగాంధీ గానా-బజానా’ కార్యక్రమంతో హెచ్‌సీఎం కాలేజీ సెంటర్‌లో నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు, కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి.  
 
 అద్దంకిలో మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించి, మహిళా గర్జన చేపట్టారు. ఈ సందర్భంగా ఖోఖో ఆడి, వ్యాయామాలు చేసి నిరసన తెలిపారు. స్థానిక బంగ్లా రోడ్‌లో విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఘనంగా సన్మానించారు. బల్లికురవలో ఉపాధ్యాయ జేఏసీ, యూటీఎఫ్‌ల ఆధ్వర్యంలో వేరువేరుగా రిలే నిరాహార దీక్షలు చేశారు. పంగులూరులో ఉపాధ్యాయ జేఏసీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చీరాలలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన దీక్షలు 18వ రోజుకు చేరాయి. బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కల వారి హక్కుల సంఘానికి చెందిన వారు రిలే దీక్షలు చేశారు. మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక భారతి, శ్రీవాణి కళాశాలల విద్యార్థినీలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు.  వేటపాలెంలో  మహిళా ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. దర్శిలో ఉపాధ్యాయులు బైక్‌ర్యాలీ, ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
 
 కొనసాగుతున్న రిలే దీక్షలు:


 గిద్దలూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బలిజ సంఘం నాయకులు దీక్షలకు కూర్చున్నారు. అలాగే పట్టణంలో విద్యుత్ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ రంగాల్లోని మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయులు, కొమరోలులో ఎయిడెడ్ ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కందుకూరులో భారీ ర్యాలీ నిర్వహించి పోస్టాఫీస్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. కబడ్డీ, ముగ్గులతో,  మ్యూజికల్స్ చైర్స్ ఆడి నిరసన తెలియజేశారు. గుడ్లూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. టంగుటూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహాధర్నా  నిర్వహించారు.
 
 కనిగిరిలో మహిళా లోకం గళమెత్తింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో  మహిళలతో నిరసన ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించగా, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు రిలే దీక్షలో కూర్చున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కనిగిరి, పామూరు, హనుమంతునిపాడులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  
 
 మార్కాపురంలో కదం తొక్కిన మహిళలు:


 మార్కాపురం మహిళల నిరసనతో దద్దరిల్లింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ఐసీడీఎస్ కార్యకర్తలు, ఆయాలు, ఉద్యోగులు, ఐకేపీ మహిళా సంఘాల సభ్యులు, మహిళా ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు మార్కాపురం నుంచి పెద్దదోర్నాల మీదుగా బైక్ ర్యాలీ చేశారు. ఏపీటీసీఏ సభ్యులు ర్యాలీ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మానవహారం నిర్వహించారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, సోనియా మాస్క్‌లు ధరించిన మహిళలను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తర్లుపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా కాగడాల ప్రదర్శన చేపట్టారు. పొదిలిలో  సమైక్యాంధ్ర కోరుతూ పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీ చేసి, రాస్తారోకో నిర్వహించారు. యర్రగొండపాలెంలోనూ మహిళలు ఉద్యమ బాట పట్టారు. పట్టణంలో అంగన్‌వాడీ సూపర్ వైజర్లు, కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో మోటారు బైకుర్యాలీ చేపట్టారు.  చైతన్య పాఠశాల విద్యార్థులు రోడ్డుపై వేసిన కోలాటం ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.  పుల్లలచెరువులో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రోడ్డుపై వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుపైనే భోజనాలు చేసిన నిరసన వ్యక్తం చేశారు. పెద్దదోర్నాలలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement