పదునెక్కిన సమైక్యం
Published Thu, Oct 17 2013 3:08 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో చేపట్టిన సమైక్య ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. దసరా పండుగ అనంతరం ఉద్యమం మరింత పదునెక్కింది. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో జిల్లా అట్టుడుకుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం లో భాగంగా 78వ రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసనలు, మరో వైపు ఎన్జీవో నాయకుల ఆందోళనలతో జిల్లా హోరెత్తింది. మాచర్లలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని సమైక్యావాదులు ఘోరవ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పట్టుబట్టారు.
చివరకు ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుంటూరులో రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాజకీయ జేఏసీ వేదికపై బధిరులు రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. వీరికి సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విభజన వల్ల కలిగే నష్టాలను అప్పిరెడ్డి ప్రజలకు వివరించారు. నరసరావుపేటలో ఎన్జీవోలు, రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావ సభను నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం సమైక్యవాదుల విజయంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెనాలిలో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు అసెంబ్లీకి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వినతి పత్రం అందజేసి తిరిగి తెనాలి వచ్చిన వైఎస్సార్ సీపీ బృందం సభ్యుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఘన స్వాగతం లభించింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి వచ్చిన ఆయనను భారీ ర్యాలీ నడుమ నాజరుపేటలోని పార్టీ కార్యాలయం వరకు తోడ్కొని వచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరుగుతున్న దీక్షల్లో యడ్లపాడు మండలం సందెపూడి గ్రామానికి చెందిన యువకులు పాల్గొన్నారు. శిబిరాన్ని మర్రిరాజశేఖర్, పార్టీ నాయకులు చుండి రమేష్ ప్రారంభించారు. బాపట్లలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి రిక్షాఫుల్లర్స్‌తో కలసి ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో గ్రామ సేవకులు పాల్గొన్నారు. పొన్నూరులో సమన్వయకర్త రావి వెంకట రమణ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష కొనసాగుతుంది. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement