వీళ్లు..మారరు! | law and order in anantapur district | Sakshi
Sakshi News home page

వీళ్లు..మారరు!

Published Mon, Mar 28 2016 9:58 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

law and order in anantapur district

  అదుపు తప్పిన శాంతిభద్రతలు
  పెచ్చుమీరుతున్న నేరాలు  పట్టించుకోని పోలీసులు
  ఎస్పీ ఆదేశిస్తే నాలుగు రోజులు కదలిక..ఆపై షరామామూలే
  అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కొందరు.. అత్యాశతో మరికొందరు

 
అనంతపురం: ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినా అధికార పార్టీ నేతలు మాత్రం భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదు. వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ ఈ నెల 24న ‘ఉచితం ఉత్తిదే’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనికి  ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందించి వెంటనే రీచ్‌లను తనిఖీ చేయించారు. అక్రమార్కులను అరెస్టు చేసి.. కేసులు నమోదు చేశారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా సాగుతోన్న వైనం, పోలీసుల పాత్రను వివరిస్తూ  ఈ నెల 27న ‘సాక్షి’లో ‘బెట్టింగ్ హీట్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది.  తీవ్రంగా పరిగణించిన ఎస్పీ వెంటనే దాడులకు ఆదేశించారు. పలుచోట్ల అరెస్టులు చేశారు.ఈ రెండు ఉదాహరణలు చాలు పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి. ఎస్పీ కన్నెర్ర చేసినప్పుడు మాత్రమే పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. తర్వాతే షరామామూలే. ‘అనంత’ కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. నేరాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పోలీసులు నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలి. నేరనియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. అయితే.. జిల్లాలో పలుచోట్ల ఎస్‌ఐలు, సీఐల పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నిరోజులూ ఇసుక అక్రమరవాణా పోలీసులకు తెలిసే జరిగిందనే ఆరోపణలున్నాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, కాల్‌మనీ వ్యవహారాల్లోనూ ఇదే తంతు నడిచింది.

పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు ‘మీ కనుసన్నల్లో అంతా సవ్యంగా నడుస్తోంద’ని కొందరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఘటన జరిగినప్పుడు పత్రికల్లో వార్తలు చూసి ఎస్పీ ప్రశ్నిస్తే...అప్పుడు మాత్రం సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే తార్కాణం. అసలు ‘అనంత’లో క్రికెట్ బెట్టింగ్ లేదని, మట్కాను పూర్తిగా అరికట్టామని, కాల్‌మనీ ఉదంతాలను కూడా పూర్తిగా నివారించామని ఎస్పీకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ ఈ తరహా నేరాలు జూలు విదిల్చుతూనే ఉన్నాయి.

 అధికారపార్టీ నేతల ఒత్తిళ్లూ కారణమే
 పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వహించకపోవడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు కూడా కారణంగా తెలుస్తోంది.  స్టేషన్‌కు 10 ఫిర్యాదులొస్తే కనీసం ఏడింటికి అధికారపార్టీ నేతల నుంచి సిఫార్సులు వస్తున్నాయి. ‘ఫలానా వ్యక్తికి ఫేవర్‌గా చేయి’అని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ధనార్జనకు అలవాటుపడిన కొందరు పోలీసులు వారి సర్కిల్, స్టేషన్ పరిధిలో పంచాయితీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 మచ్చుకు కొన్ని..
‘అనంత’ ఒకటి, రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ల పరిధిలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోంది. ఈ సెంటర్లన్నీ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి.
అనంత టూటౌన్ పరిధిలో కాల్‌మనీ ఉదంతాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై రోజూ పంచాయితీలు స్టేషన్‌లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.ఈ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల కూడా ఓ పోలీసు అమర్యాదగా మాట్లాడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం కిందట ఈ పోలీసు తనపై ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించారని ఓ మహిళ మీడియా దృష్టికి తెచ్చింది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఈ సర్కిల్‌లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అనంతలో కాల్‌మనీ బాధితులు స్టేషన్ మెట్లెక్కితే వారించడం, చిన్న పంచాయితీ చేసి పంపడం మినహా బాధితుల పక్షాన కేసులు నమోదు చేయడం లేదు. నగరపాలకసంస్థ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఇప్పటికీ ‘కాల్‌మనీ’ నడుపుతున్నారు. కానీ ఆయన ఇంట్లో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు.
ఇటీవల ‘అనంత’కు చెందిన ఓ వ్యక్తిని బాగేపల్లి సమీపంలో సజీవదహనం చేశారు. కళ్యాణదుర్గం పరిధిలోని పాలవాయి సమీపంలో మరో వ్యక్తిని హత్య చేసి దహనం చేశారు. ఈ రెండు హత్యలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఇలాంటి వివాదాలతోనే ఉరవకొండలోనూ హత్య జరిగింది. ‘అనంత’లో హెరాయిన్ విక్రయాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement