
'కోట్లు ఖర్చుపెట్టి.. లోకేష్ ఏం సాధించాడు'
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలు, మహిళలు, బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు సేకరించానని చెబుతున్నా.. అందులో 17 వేల ఎకరాలు కూడా లేవని ఆమె మండిపడ్డారు.
రాజధాని పేరుతో 10 వేల ఎకరాలు సింగపూర్ కు ధారదత్తం చేసి రైతుల నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి అవగాహన లేని లోకేష్ ను ప్రమోట్ చేయడానికి బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ఏ హోదాలో అమెరికాలో పర్యటించారని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోకేష్ సాధించిందేమిటని ఆమె ప్రశ్నించారు.