కాంట్రాక్టర్లకు పీఏలతో ఫోన్లు చేయించిన ప్రజాప్రతినిధులు!
టెండర్‌ను తమ వారికి వదిలేయాలంటూ బెదిరింపులు
లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు
ఏలూరు : ‘నేను ఫలానా ప్రజాప్రతి నిధికి పీఏను. ఆ పనికి మీరు టెండర్ వేశారంటగా. వెంటనే టెండర్ షెడ్యూల్ వెనక్కి తీసుకోండి. లేకపోతే.. మీ సంగతి చూస్తాం’ అంటూ ఇరిగేషన్ పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను హెచ్చరించిన ఘటనలు జిల్లాలో గురువారం చోటుచేసుకున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు అడ్డం తిరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని నల్లసముద్రం చెరువును ఆధునికీకరించేందుకు రూ.49.4 లక్షలను కేటాయించారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఈ-టెండర్ పిలిచారు. టెండర్ షెడ్యూళ్లను దాఖలు చేసేం దుకు గురువారం చివరి తేదీ కాగా, సుమారు 20 మంది టెండర్లు వేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. పోటీ ఎక్కువ ఉండటంతో కనీసం 27 నుంచి 30 శాతం వరకూ తక్కువ ధరకు టెండర్లు కోట్ చేసినట్టు సమాచారం. అయితే ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి, ఒక ప్రజా ప్రతినిధికి అనుకూల మైన కాంట్రాక్టర్ ఈ టెండర్ దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ఆయన 0.5 శాతం తక్కువకు టెండర్ వేశారు. మిగిలిన కాంట్రాక్టర్లను టెండర్లు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. ఒక ముఖ్యప్రజాప్రతినిధి దగ్గర పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)తోపాటు జిల్లాలో దుందుడుకుగా వ్యవహరించే ప్రజాప్రతినిధి సన్నిహితుడు ఒకరు రంగంలోకి దిగారు. కాంట్రాక్టర్లందరికీ ఫోన్లుచేసి ‘మీరు పోటీ నుంచి తప్పుకుంటే మంచిది. కాకుంటే మా బాస్‌ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మధ్యాహ్నం మూడు గంటలలోపు టెండర్లు వెనక్కి తీసుకోకపోతే మీ పని అంతే’నంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీతో ఢీకొట్టడానికి భయపడిన కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. అయితే కొందరు కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని ముఖ్యప్రజాప్రతినిధి వద్దే తేల్చుకుంటామని అడ్డం తిరగడంతో టెండర్ దక్కించుకోవాలనుకున్న నేత ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా వుండగా, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేయడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సొంత పార్టీ వారిని కూడా బెదిరించడంపై వారు అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.
తప్పుకుంటే సరి.. లేదంటే అంతే..
Published Fri, May 27 2016 1:01 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
Advertisement
Advertisement