సాక్షి, మంచిర్యాల : ‘పుర’ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు పురపాలక అధ్యక్ష పదవుల్లో ఐదు స్థానాలు మహిళలకు ఖరారు కావడంతో ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యంగా అధ్యక్ష పదవులకు పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నా ప్రధాన పార్టీ నాయకులకు చుక్కెదురైంది. గతేడాది జూన్‌లోనే వార్డులవారీగా కేటాయించిన రిజర్వేషన్లలో సగం స్థానాలు మహిళలకు కేటాయించడంతో ఆయా వార్డుల్లో పోటీ చేద్దామనుకున్న నాయకులూ నిరాశకు గురయ్యారు.
ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డులో 94 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఆదిలాబాద్‌లో 36 వార్డులకు గాను 18 స్థానాలు మహిళలకు కేటాయించారు. మంచిర్యాలలో 32వార్డుల్లో 16, బెల్లంపల్లి 34 వార్డుల్లో 17, కాగజ్‌నగర్ 28 వార్డులకు 14, భైంసా 23వార్డులకు 11, నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులుంటే 18మహిళలకు రిజర్వ్ అయ్యాయి. తాజాగా.. ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో మహిళా స్థానాల్లో తమ భార్యలు, కూతుళ్లు, చెల్లెళ్లను బరిలో నిలబెట్టేందుకు అన్ని పార్టీల నాయకు లు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీ ల్లో మందమర్రి మినహా అన్నిట్లో ఎన్నిక లు జరగనున్నా యి. వీటిలో ఆదిలాబాద్, మంచిర్యాల, భైంసా, బెల్లంగపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో అధ్యక్ష పదవులు మహిళలకు కేటాయించారు. ఇదిలావుంటే.. సాధారణ ఎన్నికలకు ముందే పురపాలక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటములే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో పార్టీలు ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలనే ఆలోచనలోపడ్డాయి.
పక్క వార్డుల వైపు చూపు..
గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన పలువురు కౌన్సిలర్ల ఆశలపై వార్డు రిజర్వేషన్లు ఈ సారి నీళ్లు చల్లాయి. ఆ స్థానాలు మహిళలకు కేటాయించడంతో కొందరు నాయకులు ఆ వార్డు నుంచి వారి భార్య, కూతుళ్లు, తల్లిని నిలబెట్టాలని నిర్ణయించారు. ఇటు ప్రధాన పార్టీల నాయకులు కొందరు జనరల్ స్థానాలున్న వార్డులపై కన్నేశారు. ఇప్పటికే పట్టణాల్లో పలుకుబడి, పరిచయాలు ఉండడంతో వాటిని ఆసరా చేసుకుని ఇప్పటికే పోటీ చేయాలనుకుంటున్న వార్డులో పర్యటిస్తూ అక్కడ పరిచయాలు ఏర్పర్చుకున్నారు. వార్డులో ముఖ్యులను కలిసి వారి సహకారం కోసం తంటాలు పడుతున్నారు. మంచిర్యాల పట్టణంలో ఓ పార్టీకి చెందిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆరు నెలల నుంచి సమీప వార్డు నుంచి పోటీ చేసేందుకు ఆ ప్రాంతంలోనే తిష్ట వేశారు. తాజాగా అధ్యక్ష పదవి మహిళకే కేటాయించడంతో పలువురు తమ భార్య, కూతుళ్లు, తల్లి గెలుపుపై దృష్టి పెట్టారు.
ఆశలు గల్లంతు
Published Wed, Mar 5 2014 12:19 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement