
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. సత్తుపల్లి 23, మధిర 22, వైరాలో 20వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఏ వార్డు ఎవరికి రిజర్వు అయిందనే అంశాన్ని ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లను కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల సందడి ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ ప్రకటించకపోవడంతో ఆశావహులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించగా.. ఆదివారం వార్డులవారీగా రిజర్వేషన్లు, చైర్మన్ పీఠం ఎవరికి రిజర్వు అయిందనే అంశాలు కూడా తేలే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు టికెట్ల కోసం తమవంతు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు.
రిజర్వేషన్లు ఇలా..
సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మున్సిపాలిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించారు. ఆ ప్రకారం సత్తుపల్లిలో 23 వార్డులకుగాను.. ఒక వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీలకు మూడు.. రెండు వార్డులు ఎస్సీ జనరల్, ఒక వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 7 సీట్లు కేటాయించగా.. 4 బీసీ జనరల్‌కు, 3 బీసీ మహిళకు కేటాయించారు. మహిళలకు 7 వార్డులు కేటాయించగా.. 5 సీట్లు జనరల్‌కు కేటాయించారు.
మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా.. ఎస్టీ జనరల్‌కు ఒక వార్డు కేటాయించారు. ఎస్సీలకు 6 వార్డులు.. మూడు వార్డులు ఎస్సీ జనరల్‌కు, 3 ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 4 సీట్లు కేటాయించగా.. 2 బీసీ జనరల్‌కు, 2 బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మహిళలకు 6 వార్డులు రిజర్వు చేయగా.. జనరల్‌కు 5 వార్డులు కేటాయించారు.
వైరాలో 20 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీలకు 5 వార్డులు కేటాయించగా.. 3 ఎస్సీ జనరల్‌కు, 2 వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు చేశారు. వీటిలో 2 బీసీ జనరల్‌కు, 2 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 6 జనరల్ మహిళకు, 4 జనరల్‌కు కేటాయించారు. మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో సీటును ఎస్టీలకు కేటాయించారు.
50 శాతం మహిళలకే..
ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించారు. సత్తుపల్లిలో మొత్తం 23 వార్డులు ఉండగా.. ఎస్సీ, బీసీ జనరల్ మహిళకు కలిపి 11 వార్డులు కేటాయించారు. అలాగే మధిరలో 22 వార్డులకు గాను.. 11 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు కేటాయించారు. వైరాలో 20 వార్డులకు గాను.. 10 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ప్రతి మున్సిపాలిటీలోనూ మహిళా ప్రాతినిధ్యం 50 శాతం ఉండనున్నది.
Comments
Please login to add a commentAdd a comment