సాక్షి, కరీంనగర్: మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియలో తొలిఘట్టం ముగిసింది. మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏ కేటగిరీకి ఎన్ని వార్డులను రిజర్వు చేశారో తేలింది. ఆయా పుర, నగర పాలక సంస్థల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ, జనరల్ ఓటర్ల సంఖ్యతో రూపొందించిన కులగణన ద్వారా ఆయా కేటగిరీలకు కేటాయించే వార్డుల సంఖ్యను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీల్లో ఉన్న జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులను ఆయా కేటగిరీలకు కేటాయించారు.
ఆయా కేటగిరీలకు కేటాయించిన వార్డులను బట్టి మునిసిపల్ కార్పొరేషన్లలో కరీంనగర్ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్‌లో లేని విధంగా 60లో అన్‌రిజర్వుడు(జనరల్) 30 స్థానాలు పోగా ఏకంగా 23 వార్డులను బీసీలకు రిజర్వు చేశారు. 6 స్థానాలు ఎస్సీలకు, ఒక స్థానాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. దీనిని బట్టి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అలాగే రామగుండం కార్పొరేషన్‌లో ఎస్సీలకు అత్యధికంగా 11 వార్డులు కేటాయించారు. ఇక్కడ 50 స్థానాలు ఉండగా, 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా 25 స్థానాల్లో 11 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు.
రాష్ట్రంలో మరే కార్పొరేషన్‌లో ఎస్సీలకు ఇన్ని స్థానాలు లేవు. ఈ రిజర్వుడు స్థానాలను బట్టి కరీంనగర్ మేయర్ స్థానం బీసీలకు, రామగుండం ఎస్సీలకు రిజర్వు చేయడం దాదాపు ఖాయమైంది. మహిళలకా, జనరల్ స్థానమా అనేది తర్వాత తేలనుంది. మునిసిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలక సంస్థలను ఒక యూనిట్‌గా తీసుకొని జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తారు. మునిసిపాలిటీల్లో కూడా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి వంటి స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్ లెక్క ఇదీ..
వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌లకు కేటాయించిన వార్డులను బట్టి కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లు బీసీ, ఎస్సీలకు రిజర్వు అయ్యేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 50 శాతం మించకుండా ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డుల సంఖ్యను రిజర్వు చేసింది. కరీంనగర్‌లోని 60 వార్డుల్లో జనరల్ స్థానాలు 30 పోగా మిగతా 30లో ఎస్సీలకు కేవలం6 స్థానాలు(10 శాతం), ఎస్టీలకు ఒక స్థానాన్ని కేటాయించారు. బీసీలకు ఏకంగా 23 స్థానాల(38 శాతం)ను కేటాయించడం గమనార్హం. దీనిని బట్టి కరీంనగర్ బీసీ కేటగిరీలో రిజర్వు అయ్యే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది.
ఇక ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రామగుండం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను సగం జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 25లో ఏకంగా 11 స్థానాలు(20 శాతం) ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ బీసీలకు కేవలం 13 స్థానాలు, ఎస్టీలకు ఒక స్థానం మిగిలింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కో వార్డును ఎస్టీకి కేటాయించారు.
నేడు తేలనున్న వార్డులు
ప్రకటించిన రిజర్వు స్థానాల సంఖ్య ఆధారంగా ఏయే వార్డులను ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారనేది ఆదివారం తేలుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న వార్డులను వారికి కేటాయించిన సంఖ్య ప్రకారం తొలుత కేటాయిస్తారు. తరువాత ఓటర్ల గణన ప్రకారం బీసీ కేటగిరీకి వార్డులను కేటాయించిన అనంతరం మిగిలిన వాటిని జనరల్ కేటగిరీ కింద ప్రకటిస్తారు. అనంతరం ఆయా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు, ఎవరికి కేటాయించని స్థానాలను లాటరీ పద్ధతిలో డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సిల్‌లో 50 శాతం మహిళలు ఉండేలా వార్డులను రిజర్వు చేయడం గమనార్హం.
రేపు మునిసిపల్ చైర్‌పర్సన్, మేయర్ రిజర్వేషన్
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఏ కేటగి రీకి ఎన్ని వార్డులను కేటాయించారనే లెక్క తేలగా, అవి ఏయే వార్డులనే విషయం ఆదివారం వెల్లడి కానుంది. ఇక మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలను ఏ కేటగిరీకి రిజర్వు చేశారనేది సోమవారం స్పష్టం కానుంది. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని జనాభా ఆధారంగా మేయర్, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. రాజ కీయ నేతల్లో ఈ మేరకు టెన్షన్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment