మెదక్‌లో మున్సిపల్‌ రిజర్వేషన్ల ఖరారు | Reservations Announced In Medak Regarding Local Elections | Sakshi
Sakshi News home page

మెదక్‌లో మున్సిపల్‌ రిజర్వేషన్ల ఖరారు

Published Sun, Jan 5 2020 11:12 AM | Last Updated on Sun, Jan 5 2020 1:40 PM

Reservations Announced In Medak Regarding Local Elections - Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలో మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్‌ మినహా అన్నీ కొత్తగా ఆవిర్భవించినవే. షెడ్యూల్‌ ప్రకారం గత నెల 30న ఓటరు ముసాయిదా జాబితాను అధికారులు ప్రదర్శించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 71 అభ్యంతరాలు రాగా స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. దీనిపై మున్సిపల్‌ అధికారులను సంప్రదించగా.. సామాజిక వర్గాల్లో తేడాలు వస్తే సరి చేశామని చెప్పారు.

చనిపోయిన వారిని తొలగించే హక్కు తమకు లేదన్నారు. తుది జాబితా ప్రకారం మెదక్‌ మున్సిపాలిటీలో మొత్తం 33,221, తూప్రాన్‌లో 17,597, రామాయంపేటలో 11,672, నర్సాపూర్‌లో 14,155 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం మహిళలు 39,074, పురుషులు 37,571 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుష ఓటర్ల కంటే మహిళలే 1,503 మంది అధికంగా ఉన్నారు.   

సామాజిక వర్గాల వారీగా..  
మెదక్‌ మున్సిపాలిటీలో ఎస్టీ ఓటర్లు 752, ఎస్సీలు 4,314, బీసీలు 23,681, ఇతర సామాజిక వర్గాల వారు 4,774 మంది ఉన్నారు. తూప్రాన్‌లో ఎస్టీ ఓటర్లు 175, ఎస్సీలు 2,257, బీసీలు 12,893, ఇతరులు 2,272 మంది.. రామాయంపేటలో ఎస్టీలు 454, ఎస్సీలు 1,473, బీసీలు 8,677, ఇతరులు 1,068 మంది ఉన్నట్లు తేలింది. నర్సాపూర్‌లో ఎస్టీ ఓటర్లు మొత్తం 549, ఎస్సీలు 1,559, బీసీలు 10,228, ఇతరులు 1,819 మంది ఉన్నారు. 

ఊపందుకోనున్న ప్రచారం..  
ఓటరు తుది జాబితా విడుదల కావడం, ఆదివారం వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ‘పుర’ పోరు జోరందుకోనుంది. ఈ నెల 7న నోటిఫికేషన్‌ జారీ కానుండా 8 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకోనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని పుర పీఠాలను చేజిక్కించుకుని మరో సారి సత్తా చాటాలనే లక్ష్యంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను ఒక్కసారి చుట్టి వచ్చారు. రెండు, మూడు పర్యాయాలు ఆయా పురపాలిక పరిధిలోని నేతలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి శనివారం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ లెక్కన పుర పోరులో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement