
ప్రత్యేక హోదా సాధన సమితి నేతలతో వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా సాధనసమితి నేతలు చలసాని శ్రీనివాసరావు, తాడి నరేష్, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
హోదాపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని హోదా సాధన సమితి నేతలతో ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడగకపోవడం వల్లే హోదా రాలేదని, ఒక వేళ చంద్రబాబు అడిగి ఉంటే హోదా వచ్చి ఉండేదని చెప్పారు. ప్రత్యేక హోదాకు కేబినేట్ ఎప్పుడో ఆమోదం తెలిపిందని.. ప్లానింగ్ కమిషన్‌ను చంద్రబాబు కలిస్తే హోదా వచ్చేదని, కాలయాపన చేసి ప్రస్తుతం డ్రామాలాడుతున్నాడని వారికి వివరించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదు, ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికేనని అన్నారు. హోదా కోసం పోరాడే వారందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. అలాగే హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక హోదా అంశం విషయంలో మొదటి నుంచి వైఎస్ జగన్ ఒకే మాటపై నిలబడి, ఈ అంశాన్ని సజీవంగా ఉంచారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ప్రశంసించారు. అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలను కలుపుకుని.. ప్రత్యేక హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా కోరారు. ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షలో పాల్గొనే ఎంపీలకు తాము సంఘీభావం తెలుపుతామని వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment