కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం.. | Sakshi
Sakshi News home page

కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం..

Published Tue, May 8 2018 4:06 PM

​Hoda Sadhana Samiti Round Table Meeting In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్‌ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్‌లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి : రామకృష్ణ
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిధుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విధ్యార్థులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు హోదా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అలా చేస్తేనే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. 20 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో హోదా దీక్షలు ప్రారంభమవుతాయి.. ఆగస్టు 15లోపు శుభవార్త వినాలంటే.. హోదా ఉద్యమాన్ని ఇప్పటినుంచే మరింత తీవ్రతరం చేయాలి’ అని అన్నారు.

ఏపీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం : చలసాని
బీజేపీ నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది లేదు కానీ.. ఏపీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయబోతున్నాం. హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరు కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏపీ పార్లమెంట్‌ సభ్యులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుంది. ప్రజాభిష్టానికి తలవంచే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టారు’  అని తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement