సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు శాసనమండలి సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇదే ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనమండలి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియకు ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. ఈలోపు ఎన్నో మార్పులు జరగవచ్చని పార్టీశ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో టీడీపీకి మూడు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. వీటిలో కులప్రాతిపదికన కేటాయించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. కుల సమీకరణలు తీసుకుంటే ఒకటి రెడ్డి, మరొకటి కమ్మ, లేదా ముస్లిం, ఇంకొకటి ఎస్సీ లేదా బీసీ సామాజికవర్గానికి దక్కే అవకాశాలున్నాయి.
పదినెలలుగా ఊరిస్తూ వచ్చిన శాసనమండలి ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో... ఈసారి ఎలాగైనా తనకే దక్కుతుందని సోమిరెడ్డి, మరోవైపు బీదా, ఆదాల ప్రభాకర్‌రెడ్డి భావిస్తున్నారు. కుల ప్రాతిపదిక ప్రకారం అయితే జిల్లాలో ఎక్కువ అవకాశాలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికే ఉన్నాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఒక సీటు ఖాయం చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన లింగారెడ్డికి ఇస్తే.. బీసీ సామాజికవర్గానికి ఒకటి కట్టబెట్టనున్నారు. అందులో భాగంగా బీదా రవిచంద్రకు దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని కోస్తా జిల్లాకు ఖాయం చేసినట్లు తెలిసింది.
ఏ క్షణంలో ఏం జరుగుతుందో...
జిల్లాలో ఎమ్మెల్సీ కోసం ముగ్గురు నేతలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒకరికి ఇస్తే మరో ఇద్దరు అలక వహించే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. బీదాకు ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని సోమిరెడ్డి, ఆదాల వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటే సోమిరెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి నాడు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆదాల పార్టీలో చేరటంతోనే టీడీపీకి ఓటు బ్యాంకు పెరిగిందని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
తమ నాయకుడికి ఎమ్మెల్సీ కట్టబెట్టకపోతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ రెండువర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో పార్టీ అధిష్టానం జిల్లాకు ఇచ్చే ఎమ్మెల్సీని కర్నూలు జిల్లాకు కేటాయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో మూడు వర్గాలు ఎమ్మెల్సీ పదవి కోసం పోటీపడుతున్న తరుణంలో ఎవరో ఒకరికి ఇస్తే.. మిగిలిన రెండు వర్గాలు అలక వహించే అవకాశం ఉంది. అదే సమయంలో ఎవరో ఒకరు కఠిన నిర్ణయం తీసుకుంటే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ఇదంతా ఎందుకు వచ్చిన తంట అని కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫరూక్‌కు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే జిల్లాకు శాసనమండలి ఎన్నికల్లో మొండిచేయి చూపే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ తలనొప్పి ఎప్పుడు ఏ ముప్పును తీసుకొస్తుందోనని తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది.
బీదాకే ఎమ్మెల్సీ?
Published Wed, Mar 11 2015 3:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement