మేడపాడు గ్రామానికి చెందిన కలవల వెంకట సురేష్‌కుమార్
యలమంచిలి: చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కలవల వెంకట సురేష్‌కుమార్. ఇతనిది మేడపాడు గ్రామం. సురేష్ గ్రామంలోనే ఫర్నిచర్ వ్యాపారం చేస్తుంటారు. ఇతనికి సెంటు భూమి కూడా లేదు. పైగా కౌలు వ్యవసాయం కూడా చేయడం లేదు. అయితే ఇతని పేరిట రెవెన్యూ అధికారులు మేడపాడు గ్రామంలోని సర్వే నంబరు 57–1లో 3.76 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారుల రుణ అర్హత కార్డు మంజూరు చేశారు. ఈ తతంగమంతా సురేష్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఏతావాత ఈ విషయం బయటపడి ఆ కార్డు సురేష్ చేతికి రావడంతో ఆశ్చర్యపోయాడు. తన ప్రమేయం కానీ, తన సంతకం కానీ లేకుండా రెవెన్యూ అధికారులు ఈ కార్డు ఎలా మంజూరు చేశారని సురేష్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నరసాపురం విజయా బ్యాంకులో కౌలు కార్డులపై కుంభకోణం జరిగిన నేపథ్యంలో తన పేరిట కూడా ఎక్కడైనా బ్యాంకులో అప్పు వచ్చిందేమోనని సురేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment