
అధ్యాపకుడికి దేహశుద్ధి చేస్తున్న విద్యార్థిని బంధువులు
అధ్యాపకుడికి దేహశుద్ధి
కంబాలచెరువు (రాజమండ్రి) : విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన అధ్యాపకుడికి ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన సంఘటన రాజమండ్రి ఆర్యాపురంలోని ప్రగతి కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మల్లయ్యపేటకు చెందిన బి.తేజశ్రీ అదే కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఆమె తరగతి గదిలో తన స్నేహితులతో మాట్లాడుతోంది. దీనిని చూసిన కామర్స్ అధ్యాపకుడు కల్యాణ్ ఆమెను పిలిచి చితకబాదాడు. విద్యార్థిని అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు.
కళాశాల విడిచిపెట్టిన తర్వాత ఇంటికెళ్లిన ఆమె ఈ విషయాన్ని తన తండ్రి రాంబాబుకు తెలిపింది. అతడితో పాటు బంధువులు కళాశాలకు వెళ్లి ఈ సంఘటనపై అధ్యాపకుడిని నిలదీశారు. అతడిని త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి.. పోలీసులకు సంఘటనను వివరించారు. దీనిపై మాట్లాడుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చంటూ కళాశాల ప్రిన్సిపాల్ మురళి నచ్చజెప్పాడు. దీంతో బాధితురాలి బంధువులు శనివారం ఉదయం కళాశాలకు చేరుకుని.. ఆ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. రాజమండ్రి అన్‌ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్(రూకా) నాయకులు అక్కడకు చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినిని వేరే కళాశాలకు మార్పు చేసి, రెండేళ్లపాటు విద్యాఖర్చులు భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి కారకుడైన అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగించారు.