
సాక్షి, విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు రాస్తారోకోలు నిర్వహించాయి. ఆర్థిక మాంద్యానికి బీజేపీ వైఖరీనే కారణమని వామపక్షాలు ఆరోపించాయి. పట్టణంలోని బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణతో పాటు వామపక్షాల నేతలు పాల్గొన్నారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్న వామపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. నల్ల ధనాన్ని వెనక్కి తెస్తానని మాట్లాడిన ప్రధాని చివరకు నల్లధనం కూడబెట్టే వారికే వత్తాసు పలుకుతున్నారనీ ఎద్దేవా చేశారు. ప్రధాని కేవలం కార్పొరేట్ వ్యవస్థని మాత్రమే బాగు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment