చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం: రైతుల రుణాల మాఫీపై మంత్రి మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దాదాపు 7 గంటలపాటు జరిగిన మంత్రి మండలి తొలి సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల మాఫీపై ఈ నెల 22వ తేదీలోగా నివేదిక ఇవ్వమని కమిటీని కోరినట్లు తెలిపారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం కోసం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి పథకాలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తామన్నారు. కార్పొరేట్ సహకారం, పీపీపీ విధానంలో మినరల్ వాటర్ అందిస్తామని చెప్పారు. తమిళనాడు,కేరళ ఎక్సైజ్ పాలసీల అధ్యయనం చేసి ఇక్కడ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేస్తామన్నారు.
అక్టోబర్ 2 నుంచి సామాజిక పింఛన్లను పెంచుతామన్నారు. రెండు శ్లాబుల్లో వికలాంగులకు పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. 80 శాతంలోపు వైకల్యం ఉంటే నెలకే వేయి రూపాయలు, 80శాతం పైబడి వైకల్యం ఉంటే 1500 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. జిల్లా, జోనల్ స్థాయిల్లో పదవీ విరమణ వయస్సు పెంపు ఈనెల నుంచే అమలవుతుందని చెప్పారు. ఉద్యోగుల విభజన అయిన తరువాతే రాష్ట్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. ఆదాయానికి పెంచుకోవడానికి వ్యాట్‌పైనే దృష్టి పెడతామన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనపై 5శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు. ధరల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్తరాజధాని నిర్మాణానికి ఏపీ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త రాజధాని నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందన్నారు. కొత్తరాజధానికి 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. కొత్త రాజధానికి ఎవరు ఎంత సాయం చేస్తే అంతచేయండని పిలుపు ఇచ్చారు. ఇటుకలు ఇచ్చినా చాలన్నారు. వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ ఇవ్వగలమని చెప్పారు. చెక్‌డ్యాంలు, మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు.
గతంలో జారీచేసిన జీవో ఆధారంగా సింహాచలం ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. 7 దేవాలయాల్లో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశాఖలో విమ్స్‌పూర్తికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. విశాఖలో ప్రాంతీయ క్రీడా కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా, మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు పెట్టిన అయిదు సంతకాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో విద్యార్థుల మృతికి మంత్రి మండలి సంతాపం తెలిపింది. హైదరాబాద్లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో 8 మంది మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయి.