
గీతారెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు!
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డిని సీబీఐ అధికారులు గత రాత్రి విచారణ జరిపినట్లు సమాచారం. గతరాత్రి 10 గంటల సమయంలో ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అర్థరాత్రి 12 గంటల వరకు ఆమెను ప్రవ్నించినట్లు సమాచారం. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. భూ కేటాయింపులపై సీబీఐ అధికారులు మరికొంతమంది రాష్ట్ర మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
కొద్దిరోజుల క్రితం గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. భూకేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.