లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు అంశంలో సీబీఐ కోర్టులో విచారణ నిలిపివేత
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శాంబాబ్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు అంశంలో శాంబాబ్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విచారణకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వనప్పటికీ శాంబాబ్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై జస్టిస్ ఇలంగో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శాంబాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లేపాక్షి నాల్జెడ్ హబ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో బిజినెస్ రూల్స్ ప్రకారమే శాంబాబు నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయన్నారు. అలాగే ఆయన విచారణకు అనుమతినిచ్చేందుకు కూడా నిరాకరించాయని తెలిపారు. పెపైచ్చు శాంబాబ్ ఎక్కడా కూడా నిబంధనలను మీరి వ్యవహరించలేదని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని స్పష్టం చేసిందన్నారు.
నిర్ధిష్ట ఆధారాలు చూపలేదు..
లేపాక్షికి 8,841 ఎకరాల భూమిని కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపించిందని, అయితే వీటికి నిర్ధిష్టంగా ఆధారాలు చూపలేదని శివరాజు వివరించారు. ఇదే విషయాన్ని కేంద్రం సైతం తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించిందని తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం అభిప్రాయం తీసుకున్న తరువాతనే లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందం జరిగిందని, దీనికి అప్పటి క్యాబినెట్ ఆమోదముద్ర కూడా వేసిందని చెప్పారు. శాంబాబు చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని, అందువల్ల ఆయన విచారణకు అనుమతినివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
శాంబాబ్‌ను విచారించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వనప్పటికీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. అనుమతినివ్వకపోయినా చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శాంబాబ్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న మొత్తం విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.