Lepakshi Knowledge Hub
-
విశ్రాంత ఐఏఎస్ శాంబాబ్‌కు భారీ ఊరట
సీబీఐ నమోదు చేసిన చార్జిïషీట్ కొట్టివేత ఉమ్మడి హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్ : జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి శాంబాబ్‌కు ఉమ్మడి హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపునకు సంబంధించి అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. శాంబాబ్ ఐఏఎస్ అధికారిగా పదవిలో ఉన్న సమయం లోనే ఆయన విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని నిరాకరించాయని, ఆ తరువాత ఆయన పదవీ విరమణ చేశారని, అందువల్ల ఆయనను ఇప్పుడు విచారించడా నికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామ మూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండి, అతని విచారణకు ప్రభుత్వాలు అనుమతిని నిరాక రిస్తూ ఉత్తర్వులు జారీచేసినప్పుడు, ఆ ఉత్తర్వులను దర్యాప్తు సంస్థలు సవాలు చేయని పరిస్థితుల్లో, ఆ ఉత్తర్వులు ఫైనల్ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగిని విచారించడానికి వీల్లేదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తి తన 19 పేజీల తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శాంబాబ్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉదయం తీర్పునిచ్చారు. సర్వీసులో ఉండగానే ఉత్తర్వులిచ్చాయి... ‘సీబీఐ నమోదు చేసిన కేసులో అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్–19 కింద శాంబాబ్ విచారణకు అనుమతిని నిరాకరిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13.2.2014న జీవో 604 జారీ చేసింది. తరువాత సీబీఐ కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరింది. సీబీఐ సమర్పించిన రికార్డులను పరిశీలించిన కేంద్రం దీనిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సలహాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కామెంట్లు కోరింది. సీవీసీ అభిప్రాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కామెంట్లను, సీబీఐ రికార్డులను కూడా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే శాంబాబ్‌పై ఎటువంటి కేసు లేదని స్పష్టం చేసింది. విచారణకు అనుమతిని నిరాకరిస్తూ 23.3.2016న ఉత్తర్వులు జారీచేసింది. కాగా, కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు ముందు సీబీఐ సవాలు చేయలేదు. దీంతో కేంద్రం జారీచేసిన ఉత్తర్వులు ఫైనల్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు అనుమ తిని నిరాకరించిన తరువాత ఆయన పదవీ విరమణ చేశారు. ఈ పరిస్థితుల్లో పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగిని విచారించ డానికి వీల్లేదు. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెబుతూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు శాంబాబ్‌కు సైతం వర్తిస్తుంది. పదవీవిరమణ చేసిన ఉద్యోగి విచారణకు ఎటువంటి అను మతి అవసరం లేదు. ఆ రిటైర్డ్ ఉద్యోగిపై నమోదైన కేసును సంబంధిత కోర్టు విచారణ నిమిత్తం పరిగణన లోకి తీసుకోవచ్చు. విచారణకు స్వీకరించే సమయానికి సర్వీసులో ఉంటే తప్ప నిసరిగా పీసీ యాక్ట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాంబాబ్.. తనపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అతని అభ్యర్థన, పరిగణనలోకి తీసుకోవడానికి అర్హమైనది’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందిదీ... ‘అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన 8841 ఎకరాల భూమి కేటాయింపులన్నీ కూడా బిజినెస్ రూల్స్, ఇతర నిబంధనల మేరకే జరిగాయి. ఈ కేటాయింపులన్నీ శాఖల ను సంప్రదించిన తరువాతనే జరిగాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం ఆమోదం తరువాతనే లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందం జరిగింది. అప్పటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈవ్యవహారంలో అప్పటి పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి శాంబాబ్ ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదు. ఆయన చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావు. అందువల్ల అతని విచారణకు అనుమతినివ్వడం సాధ్యం కాదు.’ అని కేంద్రం తేల్చి చెప్పింది. -
చోరీలతో బెంబేలు
చిలమత్తూరు : కోడూరు పంచాయతీ అంజితండా సమీపంలో గల లేపాక్షి నాలెడ్జ్ హబ్ కార్యాలయంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. కార్యాలయంలోని సోఫాలు, టేబుల్స్ తదితర ఫర్నిచర్, విలువైన సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఎత్తుకెళ్లుతున్నట్లు తెలిపారు. గ్రామంలోకి కూడా చొరబడతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిఘా ఉంచాలని కోరుతున్నారు. -
ఐఏఎస్ అధికారి శాంబాబ్‌కు హైకోర్టులో ఊరట
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు అంశంలో సీబీఐ కోర్టులో విచారణ నిలిపివేత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శాంబాబ్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు అంశంలో శాంబాబ్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విచారణకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వనప్పటికీ శాంబాబ్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై జస్టిస్ ఇలంగో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ శాంబాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లేపాక్షి నాల్జెడ్ హబ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో బిజినెస్ రూల్స్ ప్రకారమే శాంబాబు నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయన్నారు. అలాగే ఆయన విచారణకు అనుమతినిచ్చేందుకు కూడా నిరాకరించాయని తెలిపారు. పెపైచ్చు శాంబాబ్ ఎక్కడా కూడా నిబంధనలను మీరి వ్యవహరించలేదని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని స్పష్టం చేసిందన్నారు. నిర్ధిష్ట ఆధారాలు చూపలేదు.. లేపాక్షికి 8,841 ఎకరాల భూమిని కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపించిందని, అయితే వీటికి నిర్ధిష్టంగా ఆధారాలు చూపలేదని శివరాజు వివరించారు. ఇదే విషయాన్ని కేంద్రం సైతం తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించిందని తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం అభిప్రాయం తీసుకున్న తరువాతనే లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందం జరిగిందని, దీనికి అప్పటి క్యాబినెట్ ఆమోదముద్ర కూడా వేసిందని చెప్పారు. శాంబాబు చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని, అందువల్ల ఆయన విచారణకు అనుమతినివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శాంబాబ్‌ను విచారించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వనప్పటికీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుందని ఆయన తెలిపారు. అనుమతినివ్వకపోయినా చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శాంబాబ్‌పై సీబీఐ కోర్టులో జరుగుతున్న మొత్తం విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
నిబంధనల మేరకే ‘లేపాక్షి’ భూములు
♦ కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ ♦ అన్ని శాఖలను సంప్రదించిన తరువాతే కేటాయింపులు ♦ అధికారులు బిజినెస్ రూల్స్ ప్రకారమే వ్యవహరించారు ♦ మంత్రివర్గం ఆమోదించింది ♦ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి శాంబాబ్ లబ్ధి పొందలేదు ♦ ప్రాథమిక ఆధారాలను బట్టి ఆయనపై ఎలాంటి కేసు లేదు ♦ విచారణకు అనుమతించలేం ♦ సీబీఐకి కేంద్ర కార్యదర్శి రాజ్‌కిషన్ వత్స ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన 8,841 ఎకరాల భూ కేటాయింపులన్నీ బిజినెస్ రూల్స్, ఇతర నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని తేల్చిచెప్పింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన భూ కేటాయింపులు నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చేస్తున్న వాదనలో నిజం లేదని తేలిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజ్‌కిషన్ వత్స ఇటీవల సీబీఐకి రాతపూర్వక ఉత్తర్వులు పంపారు. అన్ని శాఖలను సంప్రదించాకే... ‘‘అన్ని శాఖలను సంప్రదించిన తరువాతే లేపాక్షి సంస్థకు భూములను కేటాయించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ ఒప్పందాన్ని అప్పటి మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఎక్కడా వ్యక్తిగత ప్రయోజనాలు పొందలేదు. బిజినెస్ రూల్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ ప్రకారమే వ్యవహరించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చేసిన భూ కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి శాంబాబ్ ఎలాంటి ప్రయోజనాలు పొందడం గానీ, దురుద్దేశాలతో వ్యవహరించడం గానీ చేయలేదు. ఆయన చర్యలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావు. సీబీఐ ఆరోపించినట్లుగా శాంబాబ్‌పై ఎలాంటి కేసు లేదు. అందువల్ల ఆయనను విచారించేందుకు అనుమతినివ్వడం సాధ్యం కాదు’’ అని కేంద్రం స్పష్టం చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,841 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ విషయంలో నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌ను నిందితుల జాబితాలో చేర్చింది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఈ కేసులో విచారించేందుకు అనుమతినివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కేంద్రానికి పంపింది. ఈ రికార్డులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సలహాను కోరింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కామెంట్లను కోరింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించిన సీవీసీ కేంద్రానికి తన సలహాను ఇచ్చింది. ఈ సలహాతోపాటు ప్రభుత్వ కామెంట్లను, సీబీఐ రికార్డులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే శాంబాబ్‌పై ఎలాంటి కేసు లేదని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ చర్యలేవీ దురుద్దేశపూర్వకమైనవి కావని స్పష్టం చేసింది. ఆయన ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చలేదని వెల్లడించింది. కాబట్టి శాంబాబ్ చర్యలను అవినీతి నిరోధక చట్టం కింద నేర దుష్ర్పవర్తనగా పరిగణించడం సాధ్యం కాదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చెప్పిందంటే... ► ఈ మొత్తం వ్యవహారంలో శాంబాబ్ లంచం తీసుకున్నట్లు ఎక్కడా ఎలాంటి అభియోగాలు లేవు. ► లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందానికి సంబంధించిన ఫైల్‌ను శాంబాబ్ అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రాసెస్ చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను డెవలపర్‌గా తీసుకొచ్చింది ఏపీఐఐసీ. ► బిజినెస్ రూల్స్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీల ప్రకారమే శాంబాబ్ వ్యవహరించారు. సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా ఫైల్‌ను పంపారు. ► లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో కుదిరిన ఒప్పం దంలో ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు శాంబాబ్ తగిన చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టును ఏర్పాటు చేయకుంటే భూ కేటాయింపులను రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంటామనే నిబంధనలను పొందుపరిచారు. ► ఒప్పందానికి ముందు డ్రాఫ్ట్ ఎంఓ యూను శాంబాబ్ అన్ని శాఖలకు పంపారు. డ్రాఫ్ట్ ఎంఓయూలోని ప్రతీ క్లాజుపై ఆయన సంబంధిత శాఖల అభిప్రాయాలు తీసుకున్నారు. ► ఎంఓయూకు తుదిరూపం ఇచ్చే సమయంలో శాంబాబ్ కొన్ని శాఖల సలహాలను పట్టించుకోలేదని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. -
మంత్రి గీతారెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: లేపాక్షి నాలెడ్జి ఛార్జిషీట్‌ను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డితోపాటు మరికొందరికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15న కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని ఆగస్టు 27న సీబీఐ విచారించింది. గీతారెడ్డితోపాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చిన విషయం తెలిసిందే. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గీతారెడ్డిని ఏ-9గా సిబిఐ ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. -
రాజీనామా తప్పదా..!
సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్లో తన ఉండడంతో డాక్టర్. జె. గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంత్రి రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూముల కేటాయింపు వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి పేరును కూడా సీబీఐ తన చార్జిషీటులో పేర్కొనడంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా అన్నఅంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లేపాక్షి సంస్థకు భూ కేటాయింపులకు సంబంధించి సీబీఐ ఆగస్టు 27న గీతారెడ్డిని సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించింది. సుమారు 20 రోజుల తర్వాత మంగళవారం దాఖలు చేసిన చార్జిషీటులో మంత్రిని తొమ్మిదో నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. ఇదే అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ఏడాది మే 19న తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అంశం కూడా తెరమీదకు వస్తోంది. సీబీఐ చార్జిషీటులో గీతారెడ్డి పేరును కూడా చేర్చడంతో మంగళవారం మంత్రి తన నియోజకవర్గం జహీరాబాద్‌లో పర్యటనను ఆమె అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. రంజోల్‌లో వినాయక మండపాల వద్ద పూజల్లో పాల్గొనడంతో పాటు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో గీతారెడ్డి పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. డిప్యూటీ వర్గానిదే పైచేయి? రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు డిప్యూటీ సీఎం , మంత్రి గీతారెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవికి పోటీ పడినా ఆ పదవి దామోదరకు దక్కింది. ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ జిల్లా నేతలు డిప్యూటీ సీఎంకు సన్నిహితమవుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గీతారెడ్డి పోటీ చేయరనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఆరోపణలు సాకుగా తీసుకుని అటు సొంత పార్టీతో పాటు, రాజకీయ ప్రత్యర్థులు కూడా పైచేయి సాధించేందుకు పావులు కదిపే సూచనలు కనిపిస్తున్నాయి. -
గీతారెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు!
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డిని సీబీఐ అధికారులు గత రాత్రి విచారణ జరిపినట్లు సమాచారం. గతరాత్రి 10 గంటల సమయంలో ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు అర్థరాత్రి 12 గంటల వరకు ఆమెను ప్రవ్నించినట్లు సమాచారం. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. భూ కేటాయింపులపై సీబీఐ అధికారులు మరికొంతమంది రాష్ట్ర మంత్రులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. కొద్దిరోజుల క్రితం గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. భూకేటాయింపుల వ్యవహారంలో గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
మంత్రి గీతారెడ్డికి సీబీఐ సమన్లు!
రాష్ట్రమంత్రి జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో మంగళవారం గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. అయితే గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతించారు. గీతారెడ్డిని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ ఎదుట ముగిసిన ధర్మాన విచారణ
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ విచారణ బుధవారం ముగిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఆయన్ని సీబీఐ విచారించింది. దిల్కుషా అతిథిగృహంలో ధర్మాన ప్రసాదరావును సీబీఐ అధికారులు సుమారు అయిదు గంటల పాటు విచారణ జరిపారు. సీబీఐ విచారణ అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేఫాక్షి భూముల కేటాయింపులపై సీబీఐ విచారించినట్లు తెలిపారు. భూముల కేటాయింపుల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐ అధికారులు తెలిపినట్లు చెప్పారు. మళ్లీ విచారణకు రమ్మని సీబీఐ నన్ను పిలవలేదన్నారు. తనతో పాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సీబీఐ విచారించినట్లు తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారించింది. కాగా ఇప్పటికే ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు. -
ధర్మానకు నోటీసులు జారీ చేసిన సీబీఐ
-
ధర్మానకు నోటీసులు జారీ చేసిన సీబీఐ
హైదరాబాద్ : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ మంగళవారం నోటీసులు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపులపై ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. భూకేటాయింపుల సమయంలో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,848 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. అయితే లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ సంస్థకు కేటాయించిన భూముల్లో ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడంతో ఆ భూములను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.